కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కీలకంగా వ్యవహరించిన అధికారులందర్నీై ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది. ఇక కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ లను ప్రశ్నించడమే మిగిలిందని అనుకుంటున్నారు. అయితే రాజకీయ నేతల్ని విచారించడం వల్ల లాభం ఏమీ ఉండదనిపైగా ఇది రాజకీయ టర్న్ తీసుకుంటుందన్న ఉద్దేశంతో జస్టిస్ పీసీ ఘోష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయ నేతలను విచారించకుండానే.. నివేదిక సమర్పించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్, హరీష్ రావులను విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. సరైన సమయం చూసి విచారణకు పిలుస్తారని అనుకున్నారు. కేసీఆర్ ను విచారణకు పిలిస్తే అదో సంచలనం అవుతుంది.కానీ అధికార వర్గాల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి నిర్ణయాల ద్వారా అసలు తప్పెక్కడ జరిగిందో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక రెడీ చేశారని అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరంలో జరిగిన తప్పుల్ని బయట పెట్టాలంటే రాజకీయ లింకుల గురించి వీలైనంత తక్కువ ప్రచారం ఉండేలా చేయాలనుకుంటున్నారు. ఎలా చూసినా.. కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ గా వ్యవహరించింది కేసీఆర్ కాబట్టి..తప్పులన్నింటికి ఆయనే బాధ్యులవుతారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.