భారత రాష్ట్ర సమితి బనకచర్ల ఇష్యూని నెత్తికెత్తుకోవడానికి ప్రధాన కారణంగా కాళేశ్వరం కనిపిస్తోంది. ఇంకా శంకుస్థాపన కూడా జరగని ప్రాజెక్టు, సముద్రంలోకి వెళ్లే నీటిని మళ్లించుకునే ప్రాజెక్టుపై ఇంత రచ్చ చేయడానికి కారణం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. అసలు విషయం ఏమిటో మాత్రం ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసుకునే ఉద్దేశంలో ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అన్ని రకాల అక్రమాలు, అవకతవకల్ని గుర్తించి నివేదిక రెడీ చేశారు. ఇప్పుడు అది ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేబినెట్లో చర్యలు తీసుకునే అంశంపై చర్చించబోతున్నారు. ఎదురుదాడికి బనకచర్ల మాత్రమే సరైన ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోంది.
చుట్టుముడుతున్న కాళేశ్వరం తప్పులు
పది ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ… భారీగా అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టు వల్ల ఎంత లాభం అని నిపుణులు అంచనాలు వేస్తే.. పెట్టిన ఖర్చులో పది పైసల ఉపయోగం కూడా ఉండదని..పైగా కరెంట్ బిల్లులు మోతెక్కిపోతాయని వాదించారు. కేసీఆర్ చేసిన ప్రాజెక్టు రీ డిజైనింగ్ వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందని కూడా చెబుతున్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచి పెట్టి కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో బయటకు రానున్నాయి.
సమర్థించుకోవడం బీఆర్ఎస్కు కష్టమే !
కమిషన్ రిపోర్టులో ఏముందో నాలుగో తేదీన కేబినెట్ భేటీ తర్వాత బయటకు రానుంది. ఆ సమావేశంలోనే తప్పులు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని ఊహించినందునే కేటీఆర్.. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్సే ఏదో చేసిందన్న వింత ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే రిపేర్ చేయాలని అంటున్నారు. దేశంలో వంతెనల్లాంటి చిన్న ప్రమాదాలు జరిగినా కాళేశ్వరంతో ముడిపెడుతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విధానం రిజిస్టర్ అయిపోయింది. ఇలాంటి వాదనలతో.. ఏమీ జరగలేదన్న అభిప్రాయాన్ని కల్పించడం కష్టమేనని తేలిపోయింది.
బనకచర్ల పేరుతో రచ్చ చేస్తే కాళేశ్వరం అక్రమాలు వెనక్కి పోతాయా ?
ఏపీలో ఇంకా నిర్మాణమే చేపట్టని బనకచర్ల విషయంలో ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో వర్షాకాలం ప్రారంభం కాక ముందే ఆరు వందల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలోకి నీరు పోని ఏడాది లేదంటే అతిశయోక్తి కాదు. తమకు వెయ్యి టీఎంసీల వాటా ఉందని తెలంగాణ వాదిస్తోంది. అలాంటప్పుడు ఎందుకు ఆపుకోలేకపోతున్నారు. కావాలంటే ప్రాజెక్టులు కట్టుకోవాలని ఏపీ సీఎం ఆఫర్ ఇస్తున్నారు. దిగువకు వెళ్లిపోయి.. సముద్రంలోకి వెళ్లే నీటిని మళ్లించుకుంటే తెలంగాణకు ఎలాంటి ఇష్టమన్న ఆలోచన సామాన్య ప్రజలకూ వస్తుంది. అయినా రెచ్చగొట్టి…కాళేశ్వరం అక్రమాల నుంచి దృష్టి మళ్లించి బయటపడాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు.