టీజర్, ట్రైలర్‌లతో ‘కల్కి’పై ఆశలు, అంచనాలు పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ‘హానెస్ట్ ట్రైలర్’ కూడా బయటకు వచ్చేసింది. హానెస్ట్ ట్రైలర్ అనే మాట తెలుగు సినిమాకి కొత్త. ట్రైలర్ వదిలాక మరో ట్రైలర్‌ని దింపాలంటే ఏదో ఓ పేరు పెట్టాలి కదా? అందుకే ‘హానెస్ట్’ అని తోక తగిలించారు. అంతే. కల్కి ఎమోషన్‌నీ, కథనీ కాస్త రివీల్ చేసే ప్రయత్నం చేశారిందులో.
కొల్లూపూర్ ఎం.ఎల్.ఏ నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు ని దారుణంగా చంపేస్తారు. చంపింది ఎవరో తెలీదు. ఆ కేస్ డీల్ చేయడానిక ‘కల్కి’ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. తరవాత ఏం జరిగిదన్నదే ‘కల్కి’ కథ. ఇదో మర్డర్ మిస్టరీ అన్నమాట. మరి అందులోకి ఫాంటసీ అంశాలు ఎలా మేళవించారో చూడాలి. ట్రైలర్ అంతా ఒకే టెంపోలో సాగింది. రకరకాల షాట్స్.. ఎన్నో పాత్రలు. అన్నింటి లక్ష్యం.. శేఖర్ బాబు! ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు – యుద్ధం చేయాల్సింది రాముడే’ అనే మంచి డైలాగ్ కూడా వినిపించింది. ట్రైలర్‌లో ఉన్న కలరింగ్, ఎడిటింగ్ స్కిల్, షాట్ డివిజన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ‘కల్కి’ ఎవ్వరినీ నిరాశ పరచదన్న భరోసా కల్పిస్తోంది. అయితే రాజశేఖర్‌కి ఈసారి సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. ఒక్కో సినిమాలో ఒక్కో గొంతుతో పలకరించడం బహుశా రాజశేఖర్‌కి పెద్ద మైనస్ అనాలి. ఈ విషయంలో రాజశేఖర్ జాగ్రత్తగా ఉండాలేమో.