కేసీఆర్ కు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చేశారు కవిత.ఆ లేఖ తానే రాసినట్లు వెల్లడించారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లడారు. రెండు వారాల కింద కేసీఆర్ కు లేఖ రాసింది వాస్తవమేనని , కానీ ఈ లేఖ ఎలా బహిర్గతం అయిందో తేలాలని అన్నారు. కేసీఆర్ కు గతంలో ఎన్నోసార్లు లేఖ రాశానని, కానీ ఇప్పుడు లేఖ లీక్ కావడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి యావత్ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది లేఖలో వెల్లడించానని చెప్పిన కవిత.. తనకు వ్యక్తిగత ఎజెండా ఏం లేదని స్పష్టం చేశారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె అయిన తాను రాసిన లేఖ లీక్ అయింది..పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు అన్నారు.
కేసీఆర్ దేవుడు అని,ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని వారి వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు కవిత. కోవర్టులను తొలగించుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు.ఇటీవలే కుట్రలు , కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పానని, తాను ఈ విషయం చెప్పిన కొద్ది రోజులకే ఈ లేఖ బహిర్గతం అయిందంటే ఏం జరుగుతుందో ఆలోచించాలని అన్నారు.
అయితే, ఎవరు ఆమెపై కుట్రలు చేస్తున్నారు అనే ప్రశ్నకు కవిత నేరుగా సమాధానం ఇవ్వకపోయినా, పార్టీలో ఉన్న కీలక నేతలే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.