భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ, సామాజిక తెలంగాణ రావాల్సి అవసరం ఉందని బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసిన కవిత చేసిన ఈ కామెంట్స్ వెనక వ్యూహం ఉందా? బీఆర్ఎస్ లో ప్రాధాన్యత కోసమే తను ఉద్దేశపూర్వకంగా ఈ కామెంట్స్ చేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కల్వకుంట్ల కవిత రాజకీయం బీఆర్ఎస్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కొద్దికాలంగా బీఆర్ఎస్ తో ఏమాత్రం సంబంధం లేకుండానే ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోనే తను వ్యవస్థాపకురాలైన జాగృతి తరఫున పొలిటికల్ యాక్షన్స్ చేస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది.
ఆమె సొంతంగా చేపడుతున్న కార్యక్రమాల వలన పార్టీకి ప్రయోజనం ఏమో కానీ, అవన్నీ బీఆర్ఎస్ ను వేలెత్తి చూపుతున్నాయి. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కొంతకాలంగా కవిత పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ కు అస్త్రమైంది.
బీఆర్ఎస్ హయాంలో ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కవిత ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆమెకు ఫూలే ఇప్పుడు గుర్తుకువచ్చారా? అసలు ఆమె చేపడుతున్న రాజకీయ కార్యక్రమాలకు బీఆర్ఎస్ మద్దతు ఉందా? అని కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ కు దిగింది.
అయితే , ఈ విషయంపై వెనక్కి తగ్గాలని కవితకు బీఆర్ఎస్ నేతలు నచ్చజెప్పారని , ఆమె మాత్రం నో వే అన్నటుగా గాసిప్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగుతూన్న క్రమంలో తనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కవిత ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న మాట.
దీనికి కేటీఆర్ నిరాకరించడంపై కవిత అసంతృప్తిగా ఉన్నారని, ఈ కారణంగానే తనపై పార్టీలో ఎవరు కుట్రలు చేస్తున్నారో తనకు తెలుసు అని, సమయం వచ్చినప్పుడు వాటన్నింటిని బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన కవిత తిరిగి వచ్చాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు.