కవిత రాష్ట్రానికి..కేంద్రానికి మరెవరు?

ఎన్నికలు దగ్గర పడకపోయినా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పార్టీ కూడా అదే జ్వరంలో పడిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే వూహాగానాలు నడుస్తున్నాయి.కెసిఆర్‌ కుమార్తె ఎంపి కవిత జగిత్యాలలో కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డిపై పోటీ చేస్తారని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తగినట్టే ఆమె ఆ నియోజకవర్గంపై బాగా కేంద్రీకరిస్తున్నారట.చాలా సభల్లో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపై మీడియా అడిగినప్పుడు కూడా ఎక్కడ పోటీ చేయాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని మాత్రమే జవాబు చెప్పడం సందేహాలు పెంచింది. కెసిఆర్‌ మంత్రివర్గంలో మహిళలు లేరనే విమర్శల మధ్య కుమార్తె వచ్చేస్తే ఆ లోటు తీరుతుందా? ఆమె వస్తే ఇప్పుడున్న హరీశ్‌ కెటిఆర్‌ ఎవరైనా కేంద్రానికి వెళతారా? కాబోయే ముఖ్యమంత్రిగా వెలిగిపోతున్న కెటిఆర్‌ ఎందుకు వెళతారు? కెసిఆర్‌ వారసులెవరో కాలం చెబుతుందన్న కవిత మాటలో చాలా అర్థాలున్నాయా? వీరంతా ఇక్కడుంటే హరీశ్‌ ఢిల్లీ ఎందుకు వెళతారు? ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ఎవరిని నిర్ణయించినా ఒప్పుకుంటానని తనకు మరే పదవులపై ఆశలేదని ప్రకటించిన హరీశ్‌ రావు కేంద్రం వెళ్లడం ఎందుకు? కేంద్రంలో ఎవరు గెలిస్తేే టిఆర్‌ఎస్‌ పాత్ర ఎలా వుంటుంది? ఇలాటి చాలా ప్రశ్నలకు జవాబులు లేవు గాని ఏదో జరగబోతున్నదనే వాతావరణం మాత్రం కలిగిస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌ను శాసనసభకు రప్పించి ఆ స్థానం పాత ఎంపి వివేక్‌కు అప్పగించాలనే నిర్ణయం జరిగిపోయినట్టుంది. ఇంకా ఎలాటి మార్పులు చేర్పులు వుంటాయో చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ కర్త కర్మ క్రియ కెసిఆర్‌ మాత్రమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here