బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా రైల్ రోకోను ప్రకటించిన కవిత అందరినీ కలుస్తున్నారు. మద్దతివ్వాలని కోరుతున్నారు. అయితే రైల్ రోకో అంటే చిన్న విషయం కాదు. వందలు, వేల మంది వచ్చి రైల్వే ట్రాకుల మీద నిలబడితేనే సక్సెస్ అవుతుంది. కవితకు ఉన్న కార్యకర్తల బలం ఎంతో చెప్పడం కష్టం. ఒక్క ట్రైన్ ను కూడా ఆపలేరని సెటైర్లు ఇప్పటికే పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కవిత సరైన సమయం చూసుకుని రైల్ రోకోను వాయిదా వేసుకున్నట్లుగా ప్రకటించేశారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తెస్తోంది కాబట్టి.. రైల్ రోకోను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలన్నారు. ఆర్డినెన్సు తీసుకువస్తామని ప్రభుత్వ నిర్ణయం జాగృతి విజయమన్నారు. ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదించకపోతే మళ్ళీ పోరాటం ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.
బండి సంజయ్ ముందు బీసీ బిల్లును 9 వ షెడ్యూల్ లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఇప్పించాలన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందా లేదా అనేది వారంలో తెలిసిపోతుందని ఆ తర్వాత పోరాటాన్ని డిసైడ్ చేసుకుంటామన్నారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెడితేనే మర్యాద ఉంటుందని హెచ్చరిక ధోరణిలో చెప్పారు.
కవిత తన పూర్తిగా కాంగ్రెస్ పాజిటివ్ ధోరణిలో మాట్లాడుతున్నారు. బీజేపీని తప్పు పడుతున్నారు. బీజేపీదే ఇక భారం అంటున్నారు. ఆమె రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.