తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అందుకే తనకు పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా వద్దని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. ఫోన్లో మాట్లాడారు. నేరు వచ్చి కలవమన్నారు కలుస్తానని సమయం ఇవ్వాలని కోరారు. కానీ మండలి చైర్మన్ మాత్రం ఇంకా స్పందించడం లేదు.
గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తన కుమారుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. తాను కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కాంగ్రెస్తోనే సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఏ పార్టీతో సన్నిహితంగా ఉన్నా కవిత రాజీనామా ఆమోదించడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు . కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలు వస్తే సమస్య అన్న కారణంగానే ఆలస్యం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కవిత 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవి కాలం 2028 వరకూ ఉంది. ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే.. స్థానిక సంస్థల ఉపఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల సభ్యులు ఎవరూ లేరు. అందరి పదవి కాలం పూర్తి అయింది. ఎన్నికలు నిర్వహించాల్సిన ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ల వివాదం వల్ల ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది. అందుకే రాజీనామా ఆమోదంపై వేచి చూడాలని మండలి చైర్మన్ కు సంకేతాలు వచ్చినట్లుగా భావిస్తున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చో.. లేకపోతే పాత జీవో ప్రకారమో ఎన్నికలు పూర్తయి.. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ప్రతినిధులు ఉన్నారనుకుంటే.. వెంటనే కవిత రాజీనామా ఆమోదించి.. తమ పార్టీకి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేసుకుంటారు. అప్పటి వరకూ కవిత ఒత్తిడి చేసినా .. రాజీనామా చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు.