కొత్త పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత తొందరపాటుతోనే.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలోనో కానీ తప్పులు చేసేస్తున్నారు. అత్యంత కీలకమైన పార్టీ పేరులోనే ఇప్పుడు తేడా వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో భారీ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఇప్పుడు తీరా చూస్తే.. తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆమోదం తీసుకున్నామని.. పార్టీకి ఈసీ ఆమోదం తెలిపిందని కవిత ప్రకటించారు. మరి తెలంగాణ రాష్ట్ర సేన సంగతేమిటని వస్తున్న సందేహాలకు కవిత కూడా సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్ర సేన పేరు కోసం అసలు దరఖాస్తు చేయలేదట.
పార్టీ పేరు కోసం పంపిన ఐదు పేర్ల ప్రతిపాదనలో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు లేదని స్వయంగా కవిత వెల్లడించారు. మరి గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర సేన పేరుతో ఎందుకు హంగామా చేశారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అజెండా, జెండా ఆవిష్కరణ సమయంలోనూ రాష్ట్ర సేన గా పేర్కొన్న కవిత టీమ్, ఇప్పుడు అధికారిక ఉత్తర్వులలో రక్షణ సేన అని ఉండటంతో కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ రాష్ట్ర సేన పేరుతో ప్రారంభించారు కూడా.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పాత టీఆర్ఎస్ పేరును గుర్తుకు తెచ్చేలా TRS అనే పేరు కోసం రాష్ట్ర సేన అనే పేరును ప్రచారంలో ఉంచారు. కానీ సాంకేతిక కారణాల వల్ల లేదా బీఆర్ఎస్ అభ్యంతరాల వల్ల అది సాధ్యం కాదని గ్రహించి, చివరకు రక్షణ సేన పేరుతో ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, చేసిన హంగామాకు, వచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేకపోవడంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొత్తంమీద రాష్ట్ర సేన అని మొదలుపెట్టి రక్షణ సేన దగ్గర ఆగడం, కవిత కొత్త పార్టీ ప్రకటనలో మొదట్లోనే గందరగోళానికి దారితీసింది. కవిత ప్రారంభంలోనే ఇలాంటి గందరగోళం సృష్టించుకుంటే ప్రజలు సీరియస్గా తీసుకోరన్న అభిప్రాయం వినిపిస్తోంది.
