ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్… మళ్లీ ట్రాక్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. బడా హీరోల దృష్టి మళ్లీ తనవైపుకు తిప్పుకోవాలంటే ఈసారి ఓ హిట్ ఇచ్చి ఇండ్రస్ట్రీని షేక్ చేయడం తప్పనిసరి. ఇజం కోసం అందుకు ఓ ఫ్లాట్ ఫామ్ సిద్దం చేసుకొన్నాడనిపిస్తోంది. కల్యాణ్ రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇజం సినిమా పూర్తయ్యింది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయ్యింది. పూరి సినిమాలంటే పక్కా ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాలే. అయితే ఈ సినిమాకి యు బై ఏ వచ్చింది. పూరి కాస్త డోసు తగ్గించాడన్నమాట. 2గంటల 10 నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమాని షార్ప్ గా కట్ చేశాడట పూరి. నిడివి విషయంలో జాగ్రత్త తీసుకొన్నట్టే కనిపిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా ఇజం సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వొచ్చు.
మీడియా, బ్లాక్ మనీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆమధ్య దేశంలో సంచలనం సృష్టించిన పనామా ఎపిసోడ్ ని ఈ సినిమాలో పూరి చాలా తెలివిగా వాడుకొన్నాడని టాక్. మీడియాని అడ్డం పెట్టుకొన్న హీరో.. విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని ఎలా తెప్పించాడన్నది కథాంశమట. కల్యాణ్ రామ్ కారెక్టరైజేషన్ పీక్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. సినిమా అంతా ఒక ఎత్తు.. చివరి 20 నిమిషాలూ మరో ఎత్తని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టెంపర్‌లో ఎలాగైతే కోర్టు సీను రక్తికట్టించి సినిమాని ఓ లెవిల్‌కి తీసుకెళ్లాడో, ఇజంలోనూ అదే ఫార్ములాతో రక్తికట్టించాడట పూరి. ఈ సినిమా ఫ్లో సడెన్‌గా క్లైమాక్స్‌లో మారిపోతుందని, ఓ ఏమోషనల్ ఫీలింగ్‌లో థియేటర్లోంచి బయటకు అడుగుపెట్టడం ఖాయమని చెబుతున్నారు. సినిమా జయాపజయాల మాటెలా ఉన్నా దర్శకుడిగా పూరికీ, కథానాయకుడిగా కల్యాణ్‌రామ్‌కీ మంచి పేరొస్తుందని చెబుతున్నారు. జగపతి బాబు పాత్ర హైలెట్ గా నిలవబోతోందని, కథానాయిక అతిథి ఆర్య పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైందని చెబుతున్నారు. ఓవరాల్‌గా సెన్సార్ రిపోర్ట్ ఓకే. ఇక జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది ఆడియన్సే.