‘థగ్ లైఫ్’ ప్రమోషన్లలో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు మంటపుట్టించాయి. దీనిపై కర్ణాటకలో అధికార, విపక్ష పార్టీలు, సంఘాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఆయన చిత్రం ‘థగ్ లైఫ్’ కర్ణాటకలో విడుదల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. లేదంటే సినిమాను బ్యాన్ చేస్తామని కన్నడ సంఘాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన చిత్రం ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో విడుదల చేసి ప్రదర్శించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని, విడుదలకు ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
క్షమాపణలు చెప్పితే ముగిసిపోయే సమస్య ఇది. కానీ కమల్ హాసన్ మొండిఘటం. తన కెరీర్లో ఎన్నో వివాదాలు చూశారు. ఒక సందర్భంలో బహిష్కరణ లాంటి పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఏనాడూ తగ్గలేదు. తన ఐడియాలజీలోనే ముందుకు వెళ్లారు. ఈ వివాదంలో కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు కానీ సారీ చెప్పేందుకు సిద్ధంగా లేరు.
తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని , భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరేదైనా ఉద్దేశం లేదని చెబుతున్నారు. కానీ క్షమాపణ చెప్పేందుకు రెడీగా లేరు. నిజానికి, కమల్ స్వయంగా నిర్మించిన సినిమా ఇది. ఇలాంటి వివాదం వస్తే, మరొకరైతే రిలీజ్ ముందు గొడవ ఎందుకని సారీ చెప్పేందుకు మొగ్గు చూపుతారు. కానీ కమల్ రూటే వేరు.