తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే కూటమికి మద్దతిస్తోంది. అయితే ఆయన పార్టీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ నేతల ఒక్కొక్కరు రూ. 50,000 చొప్పున నామినేషన్ ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు వారంతా తాము చెల్లించిన అభ్యర్థులు, ఇప్పుడు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగమైన ఎంఎన్ఎం, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. డీఎంకే ఆఫర్ చేసిన అతి తక్కువ సీట్లు, పైగా వారి గుర్తుపైనే పోటీ చేయాలన్న షరతు తమకు ఆమోదయోగ్యం కాదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న కమల్, తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని భావించి, అభ్యర్థులను నిలబెట్టకుండా కేవలం కూటమికి మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, అప్పటికే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 60 మందికి పైగా ఆశావహులు ఈ నిర్ణయంతో షాక్కు గురయ్యారు.
తాము ఆశతో చెల్లించిన రూ. 50,000 అప్లికేషన్ ఫీజును తిరిగి ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే, పార్టీ నాయకత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఆ నిధులను పార్టీకి ఇచ్చిన విరాళాలుగా పరిగణిస్తామని, వాటిని ప్రస్తుతానికి వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో అభ్యర్థులు , కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
పార్టీ నేతల ఆవేదనను పట్టించుకోకుండా కమల్ చేస్తున్న ఈ త్యాగం సొంత పార్టీలోనే చిచ్చు పెట్టింది. గతేడాది డీఎంకే మద్దతుతోనే రాజ్యసభకు వెళ్లిన కమల్, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థులను పణంగా పెట్టారనే విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంఎన్ఎం ఆఫీసుల వద్ద ఇప్పుడు రీఫండ్ సెగ గట్టిగానే తగులుతోంది.
