రాజకీయాల్లోకి వస్తున్నా వచ్చేస్తున్నా అంటూనే మాట మార్చేశారు రజనీకాంత్. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం కుదరడం లేదని, తనని అభిమానులు మన్నించాలని కోరారు. రజనీ తప్పుకోవడంతో.. ఇప్పుడు మిగిలిన రాజకీయ పార్టీల్లో ఊపు వచ్చింది. రజనీ ఎలాగూ రాజకీయ పార్టీ పెట్టడం లేదు కాబట్టి.. తమకు మద్దతు ఇస్తే బావుణ్ణు అని కోరుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని టాక్. ఇప్పుడు.. కమల్ హాసన్ కూడా అదే దారిలో ఉన్నారు.
కమల్ `మక్కల్ నీది మయ్యమ్` అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో తనకు మద్దతివ్వాలని రజినీకాంత్‌ను కోరుతానని కమల్ హాసన్ చెబుతున్నారు. ఇద్దరూ మంచి మిత్రులు. సహ నటులు. కాబట్టి.. రజనీ మద్దతు తనకు ఉంటుందని కమల్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే రజనీ రాజకీయాల్లోకి రానంటూ ఇచ్చిన ప్రకటన తనని బాగా నిరాశ పరిచిందని, రజనీ అభిమానుల్లానే తాను కూడా బాధ పడ్డానని కమల్ గతంలోనే చెప్పారు. మరి రజనీ ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.