సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపించే కీలక పదవి అయిన అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించంది. భారత ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ నియామకం కేంద్ర ప్రభుత్వ న్యాయ విభాగంలో అత్యంత కీలకమైనది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే బాధ్యత ఈయనపై ఉంటుంది.
గత కొంతకాలంగా ఏపీకి సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిని ASG గా నియమించాలనే ప్రతిపాదన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనకమేడల రవీంద్రకుమార్ న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం కలిగిన వ్యక్తి. టీడీపీ తరపున ఓ సారి న్యాయనిపుణుడి కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. పార్టీ పరంగా కీలకమైన న్యాయ పోరాటాలను ఆయనే ముందుండి నడిపించారు.
ASGI హోదాలో సుప్రీంకోర్టు లేదా వివిధ హైకోర్టులలో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరై వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, కొత్త చట్టాల విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా సలహాలు ఇస్తారు. రాష్ట్రపతి కోరినప్పుడు రాజ్యాంగపరమైన సంక్లిష్టతలపై వివరణ ఇవ్వడం ఆయన విధుల్లో భాగం. మూడేళ్ల పాటు ఆయన పదవీ కాలం ఉంటుంది.
