ఆంధ్రాలో భాజపాకి అంత శ‌క్తి ఉందన్న క‌న్నా..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఢిల్లీలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఓ ఛానెల్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇక‌పై బూత్ క‌మిటీల ఏర్పాటు, శ‌క్తి కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెడ‌తామ‌ని కన్నా అన్నారు. దీంతోపాటు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యేందుకు కావాల్సిన పూర్తిస్థాయి ప్ర‌ణాళిక‌ను రెడీ చేసుకోబోతున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య పొత్తు కుదిరే వాతావ‌ర‌ణంపై ఆయ‌న స్పందిస్తూ… తాము రెండేళ్ల కింద‌ట్నుంచీ ఇదే విష‌యం చెబుతున్నామ‌న్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు కాంగ్రెస్ తో క‌లిసి వెళ్తున్నార‌న్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చంద్ర‌బాబు తొత్తులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు! త‌మ‌తో ఉంటూనే కాంగ్రెస్ పార్టీతో అక్ర‌మ సంబంధం న‌డిపార‌నీ, ప్ర‌పంచంలో చంద్ర‌బాబు నాయుడు కంటే అవినీతి ప‌రుడు మ‌రొక‌రు లేర‌ని క‌న్నా ఆరోపించారు.

2019లో మోడీ నాయ‌క‌త్వంలో కేంద్రంతోపాటు ఆంధ్రాలో కూడా భాజ‌పా అధికారంలోకి తీసుకుని రావ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అన్నారు. ఏపీలో ఒక్క భాజ‌పాకి మాత్ర‌మే డ‌యాస్ ఉంద‌నీ, ఎందుకంటే ఆంధ్రాని అభివృద్ధి చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీనే అన్నారు! టీడీపీ ఈ రాష్ట్రాన్ని దొచింద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ‘అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా’ అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని క‌న్నా అన్నారు! గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిసి ప‌నిచేసిన చంద్ర‌బాబు, ఇప్పుడు కాంగ్రెస్ తో ఎలా వెళ్తార‌నీ, అన్నం పెట్టిన చేతిని న‌రికే ర‌కం ఆయ‌న అంటూ విమ‌ర్శించారు.

ఏపీని అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేసింది తామేన‌ని క‌న్నా చెప్ప‌డానికి ఏమాత్రం సంకోచించ‌డం లేదు! వారు చేసిందే అభివృద్ధి… టీడీపీ పాల‌న అంతా అవినీతి అంటూ టోకున వ్యాఖ్యానించేశారు. ఒక‌వేళ వారు అంత‌గా అభివృద్ధి చేసేసి ఉంటే… టీడీపీ పొత్తు ఎందుకు తెంచుకున్న‌ట్టు..? కేంద్రంతో క‌య్యానికి కోరి కాలు దువ్వాల్సిన అగ‌త్యం చంద్ర‌బాబుకు ఏమొచ్చింది..? ఆంధ్రాకి భాజపా ఏం చేసిందో ఆ పార్టీ వారే చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. కానీ, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు త‌మ‌కు మాత్ర‌మే వేదిక ఉంద‌ని ధీమాగా క‌న్నా చెప్ప‌డం కూడా హాస్యాస్ప‌దంగానే ఉంది.

ఇంకోటి… చంద్ర‌బాబు నాయుడు కంటే అత్యంత అవినీతిప‌రుడు ప్ర‌పంచంలో ఎక్క‌డా ఉండ‌రు అని అంటున్నారు క‌దా! మ‌రి, నాలుగేళ్ల‌పాటు టీడీపీ పాల‌న‌లో ఈ యాంగిల్ భాజ‌పాకి ఎందుకు క‌నిపించ‌లేదు..? అంటే, అన్నాళ్ల‌పాటు క‌నిపించ‌నిదీ.. ఈ ఆర్నెల్లులోనే ఏం క‌నిపించేసింది…? స‌రే, ఇప్ప‌టికైనా కేంద్రం నుంచి చ‌ర్య‌లు ఎందుకు మొద‌లవ‌డం లేదు..? అలాంటిదేదో జ‌రిగితే కన్నా చెప్పిన‌ట్టుగానే ఆంధ్రాలో మ‌రింత పెద్ద డ‌యాస్ భాజ‌పాకి వ‌స్తుంది క‌దా! పార్టీని అధికారంలోకి తెచ్చే స్థాయి అవ‌కాశం ఉన్న ‘చంద్ర‌బాబు అవినీతి’ అంశాన్ని ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తున్నారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com