ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కాంతార.. అద్భుతాలు సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయం లిఖించింది. ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తన పదునేంటో చూపించేశాడు. ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
దాదాపు 3 నిమిషాల ట్రైలర్ ఇది. రిషబ్ మళ్లీ ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. కాంతార తో పోలిస్తే ఈ చాప్టర్ 1లో ప్రపంచం విభిన్నంగా ఉంది. ప్రేమ, నమ్మక ద్రోహం, యుద్ధం.. చివర్లో ఈశ్వరుడి దర్శనం.. ఇదే ‘కాంతార చాప్టర్ 1’ కథ. విజువల్ పరంగా కాంతార అబ్బురపరచబోతోంది. రిషబ్ ఈసారి మరింత కష్టపడినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. చివర్లో ఈశ్వరుడికి సంబంధించిన ఓ షాట్ ఉంది. అక్కడ కూడా రిషబ్ శెట్టినే కనిపించాడు. `కాంతార`లో ఓ మామూలు కథకు దైవత్వాన్ని అద్ది.. మరో డైమన్షన్లోకి తీసుకెళ్లిపోయాడు రిషబ్. ఈసారి కూడా అదే చేయబోతున్నాడనిపిస్తోంది. కాకపోతే ఆ వరల్డ్, అక్కడి సామాజిక స్థితిగతులు కొత్తగా అనిపిస్తున్నాయి. ఈసారి కూడా భూమి, మట్టి, సంప్రదాయాలు వీటిపై ఫోకస్ పెట్టాడు రిషబ్.
కాంతర ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేకింగ్ పరంగానూ చాలా ఖర్చు పెట్టారు. ఈ అంచనాల్ని అందుకోవాలంటే రిషబ్ అద్భుతం ఏదో చేయాల్సిందే.