తెలుగు360 రేటింగ్: 2.25/5</span
చిన్న సినిమాలు, అందులోనూ కొత్తవాళ్లతో చేసే సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక ‘వావ్‘ ఫ్యాక్టర్ ఉండాలి. సిక్కోలు యాసలో తీసిన ప్రేమకథ 'కన్యా కుమారి' టీజర్, ట్రైలర్ కొంత ఆసక్తిని రేపాయి. బన్నీ వాస్ లాంటి నిర్మాత సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం ఇంకొంత నమ్మకం కలిగించింది. మరి ఈ ప్రేమకథలోని ప్రత్యేకత ఏమిటి? ప్రేమని వ్యవసాయంతో పోల్చి దర్శకుడు నాటిన ఈ ప్రేమ విత్తనం ఎలాంటి ఫలసాయాన్ని ఇచ్చింది?
అది శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామం. కన్యాకుమారి (గీత్ సైని) చదువులో చురుకైన అమ్మాయి. స్కూల్ రోజుల్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని టార్గెట్ పెట్టుకుంటుంది. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు వస్తాయి. కానీ కుటుంబ పరిస్థితుల వలన డిగ్రీ చేసి, అయిష్టంగానే బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా సర్దుకుంటుంది. అయితే ఎప్పటికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని తన కల. తను పెళ్లాడే భర్త సాయంతోనైనా సాఫ్ట్వేర్ రంగంలో అడుపెట్టాలని ఆశపడుతుంది. అలాంటి సంబంధం కోసమే చూస్తుంటుంది. తిరుపతి (శ్రీ చరణ్ రాచకొండ) రైతుగా స్థిరపడిపోవాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంటాడు. తనుకోరుకున్నట్లుగానే ఊర్లో పొలం పనులు చూసుకొని హాయిగా గడిపేస్తుంటాడు. అయితే తను చేసిన రైతు పని కారణంగా పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకురారు. ఇదే సమయంలో తన స్కూల్ మేట్ అయిన కన్యాకుమారికి లవ్ ప్రపోజ్ చేస్తాడు తిరు. తర్వాత ఏం జరిగింది? సాఫ్ట్వేర్ కావాలనే లక్ష్యంతో జీవిస్తున్న కన్యాకుమారి రైతుగా జీవితాన్ని లాగించేస్తున్న తిరుపతికి మనసిచ్చిందా? కన్యాకుమారి ఇంజనీర్ అయిందా? వారి ప్రేమ నిలిచిందా? తెరపై చూడాలి.
కోరుకున్నట్టుగా జీవితం గడపాలని ఆశపడ్డ అమ్మాయి కథ ఇది. ఇలాంటి క్యారెక్టర్‌కి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకో సంఘర్షణ ఉంది. దాన్ని చాలా బలంగా చూపించాడు దర్శకుడు సృజన్. కుటుంబ పరిస్థితుల వలన డిగ్రీతో ఆగిపోయిన కన్యాకుమారి.. ఇంజనీర్ పూర్తి చేసుకొని జాబ్ చేస్తున్న తన స్నేహితురాలి లాప్టాప్ వంక చాలా ఆశగా చూస్తుంది. సాఫ్ట్వేర్ లోకి రావాలంటే ఏం చేయాలని జాలిగా అడుగుతుంది. ఈ సీన్ చూస్తున్నపుడు కన్యాకుమారి క్యారెక్టర్‌తో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్ పై ఒక సానుభూతి వచ్చేస్తుంది. కన్యాకుమారి కచ్చితంగా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలనే ఎంపతీ క్రియేట్ అయిపోతుంది. అయితే ఇంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న కన్యాకుమారిని ప్రేమ వైపు తిప్పి ఈ కథని ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ''ఇష్టం వేరు… జీవితం వేరు'' అనే సబ్ కాన్ఫ్లిక్ట్ని తెరపైకి తెచ్చాడు. అయితే కన్యా కుమారి మెయిన్ టార్గెట్ ముందు ఈ లవ్ స్టోరీ అంత ప్రభావంతంగా కనిపించదు.
బీజం, దున్నడం, నీరు పెట్టడం, విత్తనం, తెగులు, కోతలు.. ఇలా వ్యవసాయంలోని దశలను ప్రేమతో ముడిపెడుతూ ఈ కథని చెప్పుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. కన్యా కుమారి, తిరుపతి పాత్రలను పరిచయం చేస్తూ తీర్చిదిద్దిన ఫ్లాష్‌బ్యాక్ నుంచి కథ మొదలవుతుంది. కన్యాకుమారి పాత్ర, ఆమె చురుగుదనం లైవ్లీగా ఉంటాయి. ఆ పాత్రని చాలా శ్రద్ధగా రాసుకున్న దర్శకుడు, తిరుపతి పాత్రని మాత్రం పైపైనే రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
తమకు ఇష్టమైన జీవితాన్ని గడపడం కోసం ప్రేమని కూడా పక్కన పెట్టే క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది. అయితే సాఫ్ట్వేర్ అవ్వాలని కన్యాకుమారి కి ఉన్నంత పాషన్, రైతుగానే కొనసాగాలనే తిరుపతి పాత్రలో కనిపించదు. పైగా తిరుపతి క్యారెక్టర్ పై ఉన్నపలంగా ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుందో సరిగ్గా చూపించలేకపోయారు. ప్రేమ పుట్టడానికి ప్రత్యేకించి కారణాలు ఉండవని సరిపెట్టుకోవాలంతే.
తిరుపతి పాత్రలోని వీక్ రైటింగ్ సెకండ్ హాఫ్‌లో ఇంకా కొట్టించినట్లు కనిపిస్తుంది. తన లక్ష్యానికి సాయం అందిస్తాడని తిరుపతిని ఇష్టపడుతుంది కన్యా కుమారి. తిరుపతి కూడా తన ఇష్టాన్ని తెలియపరుస్తాడు. కోరుకున్న అమ్మాయి కోసం ఉద్యోగం చేసిన తను.. అంతా సజావుగా జరుగుందనే తరుణంలో రివర్స్ గేర్ వేస్తాడు. అది ఫోర్స్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంతేకాదు.. ఒక దశలో కథని కావాల్సినదాని కంటే ఎక్కువ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కంగాళీ చేసి చాలా కన్వినియంట్ రైటింగ్‌తో శుభం కార్డు వేశారు. అయితే అంతకుముందు వచ్చే ఎంగేజ్మెంట్ సీన్, కన్యాకుమారి ఫ్యామిలీ రియలైజేషన్ టచ్చింగ్‌గా ఉంటాయి.
కన్యా కుమారి పాత్రలో గీత్ సైని ఒదిగిపోయింది. పల్లెటూరి అమ్మాయిలా చక్కటి ముఖ వర్చస్సుతో కుదిరిపోయింది. మాటలో చలాకీతనం, క్యారెక్టర్లో హుందాదనం కనిపించింది. నిశ్చితార్థ సన్నివేశంలో ఆమె నటనకి మంచి మార్కులు పడతాయి. ఆ తర్వాత రోజు ఇంట్లో వాళ్ళతో జరిగిన సంభాషణలో ''కనీసం కూర్చునే ఉద్యోగం సంపాదించలేకపోయాను'' అని తన మనసులో బాధ బయటపెట్టిన సన్నివేశం కదిలించేస్తుంది. ఇలాంటి సీన్స్ ఇంకొన్ని పడుంటే ఫలితం మారోలా ఉండేది. తిరుపతి పాత్రలో శ్రీచరణ్ డీసెంట్‌గా చేశాడు. భద్రం, మురళీధర్ గౌడ్ తో పాటు మిగిలిన పాత్రలన్నీ పల్లెటూరి వాతావరణంలో సరిపోయాయి.
పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం మాత్రం కథనానికి ఒక ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. శ్రీకాకుళంలో తీశారు కానీ లోకేషన్స్‌లో పరిమితులు ఉన్నాయి. రెండు ఇల్లు, రోడ్డు, బట్టల షాప్, పొలం గట్టు, బీచ్.. ఇలా పరిమిత లోకేషన్స్‌లోనే కెమెరా తిరుగుతుంది. సిక్కోలు యాస సాధ్యమైనంత సహజంగా పలకడానికి ప్రయత్నించారు. చాలా వరకూ మాటలు కుదిరాయి. కొన్ని పాలిష్ అయిపోయాయి. అలాగే అక్కడ కల్చర్‌ని చూపించే ప్రయత్నం జోలికి పోకుండా దర్శకుడు దృష్టి ప్రేమకథపైనే ఉంచాడు.
'మనం ఏ విత్తనం నాటితే అదే పంట వస్తుంది. భూదేవి మ్యాజిక్'. ఈ సినిమాలో వినిపించే డైలాగ్ ఇది. కన్యాకుమారి కోసం ప్రేమ విత్తనం నాటారు. ఎంతోకొంత పంట చేతికైతే అందింది. అయితే ఇలాంటి పంటకి థియేటర్ మార్కెట్లో మద్దతు ధర ఉంటుందా అనేది అసలు ప్రశ్న. ప్రేక్షకులూ ఆదరిస్తేనే ఇలాంటి చిత్రాలకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.25/5