“కాపులను బీసీల్లో చేర్చాలి”.. అనే విషయంపై కాపునేత ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో భాగంగా అపశృతుల మినహా.. తునిలో కాపు గర్జన ఒక్కటే బలంగా జరిగిందని చెప్పొచ్చు. ఉద్యమం, పోరాటం అంటే ప్రభుత్వాన్ని ఒప్పించడం.. ప్రభుత్వపెద్దలపై ఒత్తిడి తీసుకురావడం.. పోరాటం సహేతుకమైందన్నప్పుడు ఇతర వర్గాల నుంచి కూడా మద్దతు కూడ గట్టడం.. అవిరామంగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ఒక పరిష్కరించవలసిన సమస్యగా మారడం! అయితే ఈ రేంజ్ లో ముద్రగడ ఉద్యమిస్తున్నారా.. లేక పంథా మార్చి 2019 ఎన్నికలే పరమాధిగా ప్రణాళికలు రూపొందిస్తున్నారా? భవిష్యత్తులో పోరాటం ఎలా ఉంటే ఆయనను నమ్ముకున్న, ఆయన నమ్ముకున్న కాపులకు ప్రయోజనం కలుగుతుంది? అనే విషయాలపై తాజాగా బలమైన చర్చ నడుస్తుంది.
తునిలో కాపుగర్జన జరిగి దాదాపు ఏడాదైన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఇచ్చిన హామీ నెరవేర్చేలా ఆలోచింపచేయాలని దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని ముద్రగడ పద్మనాభం కాపులకు సూచించారు. కాపు రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళనలను చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పోరాటాల్లో భాగంగా త్వరలో విశాఖలో 13 జిల్లాల కాపు జేఏసీ సమావేశం నిర్వహిస్తామని ముద్రగడ తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. పూజలు, రాజకీయ వ్యాఖ్యలు సంగతి కాసేపు పక్కనపెడితే… ముద్రగడ ఈ విషయంలో బలంగా తమ పోరాటం కొనసాగిస్తున్నారా? గతంలో సక్సెస్ అయిన ఉద్యమాలను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారా? అంటే… సమాధానాలు పూర్తి అనుకూలంగా రావడం లేదనే చెప్పాలి.
ఏపీలో సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న ముద్రగడ, ఆ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్లడం లేదని విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. ఒక ప్రణాళికా బద్దంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే.. కాపు కార్పొరేషన్ కు తాను డిమాండ్ చేసినట్లుగా నిధులు రాబట్టడం, కాపులను బీసీల్లో చేర్చడం వంటి విషయాల్లో ముద్రగడ సక్సెస్ అవ్వొచ్చనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తరుణంలో… ముద్రగడ పోరాటం ఆదిశగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. చంద్రబాబుపై రాజకీయపరమైన కామెంట్స్ చేయడం కంటే కూడా… గమ్యం ఏమిటి.. లక్ష్యం ఎక్కడుంది.. దానికి తగినట్లుగా మనం తీసుకుంటున్న నిర్ణయాలేమిటి.. వేసుకుంటున్న ప్రణాళికలేమిటి.. అనే దిశగా ఆలోచించాలని ముద్రగడకు పలువురు సూచిస్తున్నారు. ఆదిశగా ముద్రగడ అడుగులు వేస్తారని ఆశిస్తున్నారు!!