ఇండోసోల్ కంపెనీ కోసం కరేడు గ్రామంలో భూములు సేకరిస్తున్నారని తాము అంగీకరించే ప్రశ్నే లేదని అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో జగన్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగిపోయారు. తన పత్రికలో ఇండోసోల్ కంపెనీపై కుట్రలు జరుగుతున్నాయని కథనాలు రాయించారు. అయితే ఇవి రాజకీయంగా వర్కవుట్ అవుతాయి కానీ.. కంపెనీకి సమస్య రాకూడదని అనుకున్నారు. అందుకే స్వయంగా రంగంలోకి దిగి తన పార్టీ నేతలతో కరేడు నుంచి కొంత మంది రైతుల్ని ప్యాలెస్ కు పిలిపించుకున్నారు.
జగన్ను కలిసిన కొంత మంది కరేడు ప్రాంత రైతులు
నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే.. కందుకూరు నియోజకవర్గంలోని కరేడు గ్రామం నుంచి కొంత మంది రైతులు జగన్ ను కలిశారు. వారిని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తీసుకు వచ్చారు. వారు జగన్ ను తమకు అన్యాయం జరిగిపోతోందని.. బలవంతంగా భూములు తీసుకుంటున్నారని మొర పెట్టుకున్నారు. జగన్ రెడ్డి
వారికి ధైర్యం ఇచ్చారు. అండగా ఉంటామన్నారు. మరి భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా అంటే అది మాత్రం చెప్పలేదు. కానీ స్క్రిప్ట్ ప్రకారం పని పూర్తి చేశారు.
కరేడు రైతుల ఉద్యమాన్ని బలహీనం చేసే ప్లాన్
రాజకీయ పార్టీలు ఏదైనా ఉద్యమాన్ని బలహీనం చేయాలనుకుంటే ముందుగా అమలు చేసే వ్యూహం .. విభజించు.. పాలించు అనేదే. ఇక్కడ జగన్ రెడ్డి అదే అమలు చేశారు. జగన్ రెడ్డి వద్దకు కొంత మంది రైతులు వెళ్లడంతో మిగిలిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మొదటి నుంచి బాసటగా ఉన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. గుడ్ బై చెప్పేశారు. తాను ఉద్యమాన్ని విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. మిగిలిన రైతులు కూడా జగన్ అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. ఇప్పుడు వారు బలహీనమవుతారు. వారి ఉద్యమంలో చేరిన వైసీపీ మెల్లగా నిర్వీర్యం చేయడం ప్రారంభించింది.
ఇండోసోల్పై జగన్ రెడ్డికి ఎందుకంత ఆసక్తి ?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇండోసోల్ మాతృ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టని రంగం లేదు. ఓ చిన్న కంపెనీగా ఉండే ఆ సంస్థ.. ఇలా వేల కోట్ల పెట్టుబడులు పెడతామనే పొజిషన్ కు వెళ్లింది. అప్పటికే ఒప్పందాలు అయిపోవడం, విదేశీ పెట్టుబడులతో లింకప్ అయి ఉండటంతో చంద్రబాబు ఈ పెట్టుబడుల్ని తరిమేయడానికి సిద్ధపడలేదు. కానీ భూ సమస్య వల్ల ఆ పరిశ్రమ పెట్టడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే జగన్ రంగంలోకి దిగి రాజకీయం చేస్తున్నారు. రైతుల పోరాటాన్ని బలహీనంచేసి భూసేకరణ జరిగేలా చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో తొలి అడుగు ముందుకేశారు. రైతులు ఈ కుట్రల్ని గుర్తిస్తారో లేదో అంచనా వేయడం కష్టమే.