ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రవర్తనపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. శుక్రవారం కర్ణాటక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల విద్యార్థుల చదువు, ఆరోగ్యం దెబ్బతింటున్నాయని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి నిర్ణయాన్ని వెల్లడించారు. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి, రాబోయే 90 రోజుల్లో పూర్తిస్థాయి కార్యాచరణను రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల బారిన పడి పిల్లలు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అవసరమైతే ఈ వయసు పరిమితిని 16 ఏళ్లకు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రెండు రాష్ట్రాల నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్న ఇటువంటి చట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, దక్షిణాది రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును కాపాడటానికి, వారిని డిజిటల్ వ్యసనం నుండి దూరం చేయడానికి ఈ నిర్ణయాలు ఎంతో అవసరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఈ నిషేధాన్ని సాంకేతికంగా ఎలా అమలు చేస్తారు, సామాజిక మాధ్యమ సంస్థలు దీనికి ఎలా సహకరిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


