మీకు నట్లు బిగిస్తేనే కానీ దారిలోకి రారు అని కర్ణాటక డిప్యూటీ సీఎం ..కన్నడ చిత్ర పరిశ్రమను హెచ్చరించి రోజులు గడవకముందే అలాంటి పనులు ప్రారంభించారు. ఇక కర్ణాటకలో సినిమా టిక్కెట్ ధరను 200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే టిక్కెట్ ధర రూ.200కు మించకూడదని..దీన్ని మల్టిప్లెక్స్ లు కూడా పాటించి తీరాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురవుతోంది.
బెంగళూరు మల్టిప్లెక్స్‌లలో కనీస టిక్కెట్ ధర మూడు వందలపైనే ఉంటుంది. ధరలను వారి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఉదయం రేట్లకు ఓ ధర.. ప్రైమ్ షోలకు మరో ధర కూడా నిర్ణయించుకుంటున్నారు. పెద్ద సినిమాల విషయంలో అయితే చెప్పాల్సిన పని లేదు. టిక్కెట్ రేట్ల విషయంలో ఇప్పటి వరకూ వారు అపరిమితమైన స్వేచ్చ అనుభవిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు రెండు వందల రూపాయలకే టిక్కెట్ ధరను పరిమితం చేసింది.
గత వారం ప్రభుత్వం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహించింది. కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులందరికీ ఆహ్వానం పంపింది. కానీ సాధుకోకిల వంటి కొంత మంది మాత్రమే వచ్చారు. అప్పుడే డిప్యూటీ సీఎం శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ చిత్రోత్సవాన్ని ప్రభుత్వం పెట్టిందే చిత్ర పరిశ్రమ కోసమని వారు రాకపోతే ఇంకెందుకని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రం కోసం తాము చేపట్టిన ఉద్యమాలకూ కూడా మద్దతివ్వలేదని గుర్తు చేసుకున్నారు.అప్పుడే నట్లు ఎక్కడ బిగించాలో తెలుసన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రోజుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ తరహాలో ఏమైనా రాజీ చేసుకుంటారా లేకపోతే.. రెండు వందల టిక్కెట్ చాలని సర్దుకుంటారో చూడాల్సి ఉంది.