కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు , ఓటర్ల జాబితా అక్రమాలపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఓటు చోరీ పేరుతో ఉద్యమమే చేస్తున్నారు. కర్ణాటకలో ఓటు చోరీ జరిగిందంటూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. దీనిపై ఏకంగా రెండు ప్రెస్ మీట్లు నిర్వహించి, కొన్ని డాక్యుమెంట్లను కూడా ప్రదర్శించారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆయన చేసిన ఈ ఆటం బాంబు ప్రచారం కనీసం కర్ణాటక ప్రజలను కూడా నమ్మించలేకపోయిందని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే వెల్లడించింది.
రాహుల్ ఓటు చోరీ ఉద్యమాన్ని నమ్మని ప్రజలు
కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ నిర్వహించిన సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. దాదాపు 83 శాతం మంది కర్ణాటక ప్రజలు ఈవీఎంలను పూర్తిస్థాయిలో నమ్ముతున్నారని, ఓట్ల చోరీ అంశాన్ని నమ్మడం లేదని .. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని ఈ సర్వేలో తేలింది. రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలోనైతే ఓటు చోరీ జరిగిందని గొంతెత్తి చాటారో, అదే రాష్ట్రంలోని ప్రజలు ఎన్నికల వ్యవస్థపై అపారమైన నమ్మకాన్ని ప్రకటించడం గమనార్హం.
వ్యవస్థలపై దాడి చేస్తే ప్రజలు కలసి వస్తారా ?
రాహుల్ గాంధీ ఎంచుకున్న ఈ ఓటు చోరీ వ్యూహం క్షేత్రస్థాయిలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, అభివృద్ధి వంటి వాస్తవిక సమస్యలపై పోరాడటం మానేసి.. కేవలం ఈవీఎంలు, సాంకేతిక అంశాలపైనే పదేపదే విమర్శలు చేయడం వల్ల సామాన్య ఓటరు కనెక్ట్ కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా, ఓడిపోయినప్పుడల్లా వ్యవస్థలపై దాడి చేయడం వల్ల ఆయన ప్రతిష్టే మసకబారుతోంది. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. తన దారిలో తాను వెళ్తున్నారు.
ప్రజాస్వామ్య పునాదులపై కాకుండా ప్రజల కోసం పోరాడితేనే ఫలితం
ఇప్పుడున్న తరుణంలో రాహుల్ గాంధీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, విఫలమైన ఈ ఓటు చోరీ వాదనను పక్కనపెట్టి, అధికార పక్షంపై ప్రజాస్వామ్యయుతంగా ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రజాభిమానాన్ని పొందడం. రెండు, పాత పద్ధతిలోనే వ్యవస్థల మీద ఆరోపణలు చేస్తూ కాలం గడపడం. కర్ణాటక సర్వే ఫలితాల తర్వాత కనీసం ఇప్పుడు కూడా ఆయన తన విధానాన్ని సమీక్షించుకోకపోతే, భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత నష్టం చేసే అవకాశం ఉంది.
సాంకేతిక విమర్శలతో ఏ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు. ఈ పేరుతో ప్రజల్ని, యువతను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించడం కూడా సాధ్యంకాదు. ఎందుకంటే ఎవరూ నమ్మడం లేదు కాబట్టి. ప్రజలు నాయకుడి నుంచి పరిష్కారాలను ఆశిస్తారు తప్ప, ఓటమికి సాకులు వెతకడాన్ని ఇష్టపడరు. మరి రాహుల్ గాంధీ ఈ సత్యాన్ని గ్రహించి మారుతారా లేదా అన్న దానిపైనే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
