కర్ణాటకానికి ఎవరూ ఊహించని ముగింపు..!?

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేటి మధ్యాహ్నంతో ముగింపు ఖాయంగా కనిపిస్తోంది. గురువారం అంతా.. శాసనసభ నడిచినప్పటికీ.. బలపరీక్ష నిర్వహించలేదు. కాంగ్రెస్ సభ్యులు పదే పదే గందరగోళపరచడంతో..శుక్రవారానికి వాయిదా వేశారు. బలపరీక్ష విషయంలో గవర్నర్ సూచనలను కూడా స్పీకర్ పట్టించుకోలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరలోపు మెజార్టీ నిరూపించుకోవాలని.. రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్.. సీఎం కుమారస్వామిని ఆదేశించారు. దాంతో.. ఎలా చూసినా.. కర్ణాటకానికి నేటితో ముగింపు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే.. అంత మంది రెబల్ ఎమ్మెల్యేలు రాకపోయినా… కాంగ్రెస్ – జేడీఎస్ కూటమికి ఇంకా ఎడ్జ్ ఉందన్న ప్రచారం జరుగుతూండటమే అసలు ట్విస్ట్.

గురువారం మధ్యాహ్నం తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.. విశ్వాస పరీక్షను వాయిదా వేసేలా కాంగ్రెస్‌ వ్యూహరచనకు దిగింది. బలపరీక్షను వాయిదా వేసి తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్ళాలంటూ స్పీకర్‌ రమేష్‌కు సిద్దరామయ్య సూచించినట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని కూడా ఓ ఆప్షన్‌గా ఉంచుకుంది. స్పీకర్ అలా సుప్రీంకోర్టుకు వెళ్తే కొన్ని రోజులు… సంక్షోభం కొనసాగుతుంది. ఈ లోపు ఎమ్మెల్యేలను బుజ్జగించవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో బళ్లారి జిల్లా బీజేపీ నేత శ్రీరాములు వద్దకు వెళ్లి శివకుమార్ చర్చలు జరిపారు. గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన శ్రీరాములు.. కాంగ్రెస్ నేత శివకుమార్‌తో చర్చలు జరపడం.. చాలా మందిని ఆశ్చర్యపరించింది.

శ్రీరాములుకి… శివకుమార్.. ఓపెన్‌గా బంపరాఫర్ ఇచ్చారు. కాకపోతే పరోక్షంగా ఆఫర్ ఇచ్చారు. ” మీకు డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పేలేదని” శ్రీరాములును ఉద్దేశించి శివకుమార్‌ అనడంతో అందరూ అవాక్కయ్యారు. ” ఏదైనా మేము ఇవ్వగలం, బీజేపీ ఇవ్వదంటూ” కూడా శివకుమార్ చెప్పారు. దీంతో .. శ్రీరాములు.. నవ్వారు. ఆ తర్వాత కూడా.. ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. శివకుమార్ మాటల వెనుక నర్మగర్భమైన రాజకీయ ప్రతిపాదన ఉందని కర్ణాటక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అందరి చూపు శ్రీరాములు వైపు పడింది. శ్రీరాములు ఐదారుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ వైపు దూకితే.. ప్రభుత్వం బయటపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com