‘హాయ్ నాన్న’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు శౌర్యువ్. ఆ సినిమా వచ్చి రెండేళ్లయిపోంది. ఇప్పటి వరకూ శౌర్యువ్ తదుపరి సినిమా ఏమిటన్నది తేలలేదు. ‘హాయ్‌నాన్న’ తరవాత నానితోనే మరో యాక్షన్ సినిమా చేద్దామని శౌర్యువ్ అనుకొన్నాడు. స్క్రిప్టు కూడా రెడీ చేసుకొన్నాడు. కానీ నానికి కుదర్లేదు. నాని వరుస సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల శౌర్యువ్ కి ఛాన్స్ దక్కలేదు. అదే కథని… ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడు శౌర్యువ్. అక్కడ కూడా వర్కవుట్ అవ్వలేదు.
ఇప్పుడు తమిళ హీరో కార్తితో ఈ కథని ముందుకు తీసుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఇటీవల శౌర్యువ్ – కార్తిల మధ్య కథా చర్చలు జరిగాయి. లైన్ కూడా కార్తికి నచ్చిందని తెలుస్తోంది. ఈ కాంబో దాదాపుగా ఫిక్సయ్యిందన్నది తమిళ వర్గాల టాక్. ఈమధ్య తెలుగు దర్శకులతో పని చేయడానికి తమిళ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ధనుష్ తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేసేశాడు. మూడో సినిమా కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. దుల్కర్ సల్మాన్ సైతం తెలుగు కథలు, తెలుగు దర్శకుల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు. కార్తి కూడా ‘ఊపిరి’ తరవాత మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రూపంలో తనకు మరో ఛాన్స్ దొరికింది. ‘హాయ్ నాన్న’ ఓ ఎమోషనల్ డ్రామా అయితే.. ఈసారి శౌర్యువ్ పూర్తి స్థాయి యాక్షన్ కథని రాసుకొన్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి.