టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా… హీరోల దృక్పథంలో చాలా చాలా మార్పొచ్చింది. ఇది వరకు మల్టీస్టారర్ సినిమా అంటే భయపడి పరిగెట్టేవాళ్లు, ‘ఆ… మనకు మల్టీస్టారర్లు సరిపోవండి… ఇమేజ్‌లు అడ్డొచ్చాస్తాయండీ’ అని సాకులు చెప్పేవాళ్లు కూడా.. ‘మల్టీస్టారర్ చేస్తే ఎంత బాగుంటుందో’ అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు కూడా.. ఇలాంటి కథల కోసం జల్లెడ పట్టేస్తున్నారు. అయితే కార్తి మాత్రం ‘మల్టీస్టారర్ చేయలేను’ అంటూ చేతులెత్తేస్తున్నాడు. ఇది వరకు నాగార్జునతో ‘ఊపిరి’ సినిమాలో నటించాడు కార్తి. ఆసినిమాలో నాగార్జునకు ఎంత పేరొచ్చిందో, కార్తీకీ అంతే పేరొచ్చింది. అయితే ఏమైందో.. ఒక్క సినిమాకే మల్టీస్టారర్లంటే విరక్తి వచ్చేసినట్టుంది కార్తీకి. సోలో సినిమాలే సో బెటరు అంటూ కొత్త రాగం పాడుతున్నాడు.
కార్తీ అనే కాదు.. కొంతమంది యూత్ హీరోలు.. ‘సోలో’ వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే ఇన్సెక్యురీటీ ఫీలింగ్. మరో హీరో సినిమా చేస్తే అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు, ఒక వేళ హిట్ అయినా.. ఆ క్రెడిట్ తమకు వస్తుందో రాదో నమ్మకం లేదు. ఊపిరి వల్ల కార్తికి కొత్తగా కలిసొచ్చిందేం లేదు. తన ఖాతాలో ఓ సినిమా చేరిందంతే. ఈలోగా ఓ సోలో సినిమా చేస్తే… అది హిట్టయితే, తద్వారా మరుసటి సినిమాకి మార్కెట్ పెరుగుతుంది, రెమ్యునరేషన్ కూడా పెంచుకోవొచ్చు. కార్తి ప్లాన్ కూడా అదే. మల్టీస్టారర్‌కి పచ్చజెండా ఊపితే.. తన హీరోయిజం ఎక్కడ బెడసి కొడుతుందో అని భయపడుతున్నాడు. అయితే ఇలాంటి భయాల నుంచి కార్తీలాంటి హీరోలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. హీరోయిజం కోసం పడరాని పాట్లు ఎప్పుడూ పడుతుండేవే. మంచి కథ దొరికినప్పుడు, దాని వల్ల ఎంత లాభం పొందుతాం, ఎవరికి ఉపయోగం అనే లెక్కల్ని కాసేపు పక్కన పెట్టడం తప్పు కాదు. కార్తి కెరీర్లో హిట్స్ సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ ఊపిరిలో శ్రీను పాత్ర సమ్ థింగ్ స్పెషల్. అలాంటి స్పెషల్ ట్రీట్లు మిస్ చేసుకోవడం నిజంగా మూర్ఖత్వమే. మహేష్‌బాబు, ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్లు మల్టీస్టారర్ల విలువ తెలుసుకొని ముందడు వేస్తున్న తరుణాన… వాళ్లని ఫాలో అవ్వాల్సిన బాధ్యత, కొత్త కథలకు పట్టం కట్టాల్సిన అవసరం.. కార్తి లాంటి హీరోలకూ ఉంది.