ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రపంచంలో ఓ ఇది.. ఓ అది అన్నంత పేరు ఉంటుంది. అలాంటి సంస్థకు చీఫ్ గా భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ ను ట్రంప్ నియమించారు. ఇప్పుడు ఆయన ఆఫీసుకు రావడం లేదని.. ఆయనను కలవాలంటే నైట్ క్లబ్‌లకు వెళ్లాల్సి వస్తోందని అమెరికాలో గగ్గోలు రేగుతోంది. ఆయన తన విధుల కంటే నైట్ క్లబ్‌లకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని అక్కడి రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.
కాష్ పటేల్ ఎఫ్బిఐ హెడ్‌క్వార్టర్స్‌లో కంటే నైట్‌క్లబ్‌లలో ఎక్కువగా కనిపిస్తున్నారని ఎఫ్‌బీఐ మాజీ అధికారులు ఆరోపించారు. ఎఫ్‌బీఐ హెడ్ క్వార్టర్ పేరు హూవర్ భవనం. ఎఫ్‌బీఐ డైరక్టర్ రోజువారీ నివేదిక ప్రకటనలు కూడా తగ్గించేశారు. ప్రతీ రోజూ ఇచ్చేవారు. ఇప్పుడు వారానికి రెండు సార్లు మాత్రమే ఇస్తున్నారు. ఎఫ్బిఐ హెడ్‌క్వార్టర్స్‌లో “గందరగోళం” నెలకొని ఉందని, రోజువారీ కార్యకలాపాల గురించి ఎవరికీ స్పష్టత లేదని మాజీ అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాష్ పటేల్ ఆఫీసుకు రాకపోవడం వల్ల ఎఫ్‌బీఐ సామర్థ్యం తగ్గిపోతోందని , నాయకత్వ లోపం బయటపుడతోందని అంటున్నారు. అదే సమయంలో పటేల్ ఎఫ్బిఐ ప్రైవేట్ జెట్లను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఆరోపణలపై యుఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ దర్యాప్తు చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో – పటేల్ ATF యాక్టింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయుధాలు, బాంబుల నేరాలను దర్యాప్తు చేసే సంస్థ. తుపాకీ సంస్కృతిని నిరోధించడానికి తీసుక వచ్చారు. దీన్ని కూడా ఆయన పట్టించుకోవడంలేదు.
దీనికి కాష్ పటేల్ విచిత్రమైన సమాధానం ఇస్తున్నారు. మీడియాకు లీకులు ఇస్తున్నారని ఎస్ బీఐ సిబ్బందిపై పాలిగ్రాఫ్ టెస్టులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌బీఐ హెడ్ క్వార్టర్ అయిన హూవర్ భవనం సేఫ్‌గా లేదని దాన్ని మారుస్తామని అంటున్నారు. మొత్తంగా కాష్ పటేల్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్ అవుతోంది.