నువ్ ఏది ఇస్తే అది రివర్స్ లో నీకే వస్తుందని అంటారు. అప్పలరాజు విషయంలో ఇది మరోసారి నిరూపితమయింది. ఆయన ఓ సారి విశాఖలో జగన్ కార్యక్రమంలోకి పోనివ్వలేదని చెప్పి పోలీసులపై బూతులందుకున్నారు. అప్పట్లో పోలీసులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే. మామూలుగా ఆ ప్రోగ్రాంలోకి అప్పలరాజును పంపించారు. కానీ ఆయన తన అనుచరుల్ని కూడా తీసుకెళ్తానని పట్టుబట్టారు. కానీ పోలీసులు పోనివ్వలేదు. అందుకే తిట్లందుకున్నారు.
ఇప్పుడు అప్పలరాజుకు అలాంటి ఘటన రివర్స్ లో వచ్చింది. ఓ పోలీసు అధికారి ఆయనపై బూతులందుకున్నారు. వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఓ గ్రామంలో వివాదానికి సంబంధించి గ్రామస్తులు వెళ్లారు. వైసీపీ నేతలు తమపై టీడీపీ నేతలు దాడి చేశారని కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ అసలు దాడి చేసింది వైసీపీ నేతలేనని వారు రివర్స్ అయ్యారు. ఈ క్రమంలో అప్పలరాజు పోలీస్ స్టేషన్ వద్దకు యథావిధిగా పోలీసులపై రుబాబు చేయబోయారు. కేసు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. అప్పలరాజు తీరుతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సీఐ అసహనానికి గురై బూతులందుకున్నారు.
నన్ను తిడతావా అని అప్పలరాజు ఫీలై ఉండవచ్చు కానీ.. గతంలో పోలీసుల్ని అంత కంటే ఎక్కువగానే ఆయన తిట్టాడు. పోలీసుల్ని బానిసలుగా చూశాడు. ఇప్పుడు ఆయనకు ఇది రివర్స్ లో ఎదురొచ్చింది. అందుకే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు.