పవన్ కల్యాణ్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న కాటమరాయుడు రిలీజ్‌కి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈలోగా చిత్రబృందం ప్రమోషన్లని ముమ్మరం చేసింది. అందులో భాగంగా కాటమరాయుడు టైటిల్ సాంగ్ బయటకు వచ్చింది. మిరా మిరా మీసం అనే గీతాన్ని తొలి పాటగా విడుదల చేసింది చిత్రబృందం. నాయకుడై నడిపించేవాడు… సేవకుడై నడుం వంచే వాడు… అందరికోసం అడుగేశాడు.. కాటమరాయుడు. అంటూ పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాట సాగింది. పరెపరెప లాడే జెండాల పొగరున్నోడు. తల వంచక నిన్నంచుల పైనే వుంటాడు…. ఇలా చరణాల్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే పదాలు పడ్డాయి. 2019లో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాడు. అతనిపొలిటికల్ ఇమేజ్‌ని పెంచుకోవడాకి ఇలాంటి పాట తయారు చేశారా..?? అనే అనుమానాలూ వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి హీరో ఇంట్రడక్షన్ పాటల్లో వీరుడు, శూరుడు, ధీరుడు, కొట్టాడంటే అంతే, మీదడితే మీపని అవుటే… ఇలాంటి పొగడ్తలతోనే కాలక్షేపం చేస్తారు. కాటమరాయుడు పాట వింటే.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి అనువుగా ఉన్నట్టుంది. క్యాచీ ట్యూన్, రామజోగయ్య శాస్త్రి పవర్ ఫుల్ లిరిక్స్… ఈ పాటని హిట్ చేయడానికి దోహదపడ్డాయి. పవన్ నుంచి స్టిల్ వస్తేనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకొంటారు. అలాంటిది టైటిల్ సాంగ్ వస్తే ఊరకుంటారా?? ఇప్పటికే ఈ పాటకి యూ ట్యూబ్‌లో హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తున్నాయి. మరోసారి యూ ట్యూబ్‌ని కాటమరాయుడు షేక్ చేసేయడం ఖాయంలా కనిపిస్తోంది.