ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రివర్స్ లో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి విచిత్రమైన నేరెటివ్స్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని రోజూ ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి వేరే బాధ్యతలు తీసుకున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
హీరోయిన్ ఫోన్లు హ్యాకింగ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు… హీరోయిన్ ఉండే మై హోం భుజా అపార్ట్మెంట్ కు రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి వెళ్లాడని తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్మీట్లో ఆరోపించారు. అంతేనా అందాల పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలనే ఆలోచనే కానీ..ఎందుకు చేశారు.. అన్న దాన్ని మాత్రం చెప్పలేదు.
ట్యాపింగ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ కు బాధ్యతలు ఇచ్చినట్లుగా ఉన్నారు. వారు సోషల్ మీడియా కథల్ని తీసుకు వచ్చి ప్రెస్ మీట్లలో వివరిస్తున్నారు. చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని.. అన్ని అనుమతులు తీసుకుని దేశభద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని రేవంత్ రెడ్డి అన్న మాటల్ని పట్టుకుని ఆయనపై కేసులు పెట్టాలని కూడా అంటున్నారు.
ట్యాపింగ్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తూంటే.. తమపై వస్తున్న ఆరోపణలకు ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచనే తప్ప.. కాస్త అయినా లాజికల్ గా ఆరోపణలు చేద్దామన్న ప్రయత్నం చేయడం లేదని ఎవరికైనా అనిపిస్తుంది.