రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూండటాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా వ్యతిరేకించారు. గతంలో తెలంగాణ గీతం పాడేందుకు ఎస్పీబాలు వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో తనకు తెలియదని ఆయన చెప్పారు. అయితే రవీంద్రభారతి లాంటి చోట్ల తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాలని..మరో చోట అంటే.. ప్రసాద్స్ లాంటి చోట ఆయన విగ్రహాలు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.
కవిత కాస్త లిబరల్ గా ఉన్నారనే అనుకోవాలి. అసలు హైదరాబాద్ లో వద్దు అనకుండా.. రవీంద్రభారతిలో మాత్రమే వద్దు అంటున్నారు. సోమవారం రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా కొంత మంది తెలంగాణ వాదుల పేరుతో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అందుకే విగ్రహావిష్కరణ జరిగే అవకాశం ఉంది.
అయితే ఆయన తెలంగాణ పాట పాడనన్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఆయనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు కొంత మంది. బాలు సమైక్యాంధ్ర పాటలు పాడలేదు. ఆయన ఈ వివాదంలో అసలు జోక్యం చేసుకోలేదు. సంగీత ప్రపంచానికి ఆయన ఎంతో సాయం చేశారు. తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది ఔత్సాహికులకు ఆయన అవకాశాలు రావడంలో సహాయపడ్డారు. సామాన్యులెవరూ ఆయన విగ్రహాన్ని వ్యతిరేకించరు. సంగీత రంగంలో ఉన్న వారూ వ్యతిరేకించరు. కానీ రాజకీయాలకు మాత్రం ఆయన పేరు వాడుకుంటున్నారు.


