సొంత పార్టీ దిశగా కల్వకుంట్ల కవిత వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ పంపించిన సందేశానికి ఆమె సంతృప్తి చెందలేదన్న సంకేతాలు పంపుతున్నారు. తాజాగా సింగరేణి ప్రాంతానికి తన సొంత కమిటీలను ప్రకటించారు. సింగరేణి జాగృతి పేరుతో ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేశారు. సింగరేణి వ్యాప్తంగా తన అనుచరుల్ని ఆహ్వనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి అత్యంత కీలకం. సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను ఎమ్మెల్సీ కవిత నియమించారు.
గతంలో బీఆర్ఎస్ తరపున అనుబంధ సంఘాన్ని కవితే చూసుకునేవారు. అక్కడ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు జరిగినా తానే ముందుండేవారు. అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాంటిది బీఆర్ఎస్ అనుబంధ సంఘంతో పని లేకుండా.. జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాగృతి సాంస్కృతి వ్యవహారాలు చూసుకునే పని అయితే.. ఎవరూ పెద్దగా తప్పు పట్టేవారు కాదేమో కానీ.. సింగరేణిని కాపాడుకోవడానికి..కార్మికుల హక్కులను కాపాడటానికి పెట్టామని ప్రకటించారు. చివరిగా బీఆర్ఎస్ అనుబంధ సంఘంతో కోఆర్డినేట్ చేసుకుంటామని చిన్న ప్రకటన చేశారు.
కొత్త సంస్థ పెట్టి కోఆర్డినేట్ చేసుకోవడం ఎందుకు గతంలోలా బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్నే నడపవచ్చు కదా అనేది ఇతరులకు వచ్చే సందేహం. కవిత కొత్త పార్టీ పెట్టడానికి ముందే అన్ని ఏర్పాట్లు.. అనుబంధ సంఘాలను నియమించుకుంటున్నారని ఈ పరిణామంతో స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.