నీ బలం , సామర్థ్యం ఎంతో తెలియాలంటే నీ ప్రత్యర్థిని బట్టే తెలుస్తుంది. అంటే నీవు ఎంచుకునే ప్రత్యర్థిని బట్టే నీ స్థాయి ఖరారవుతుంది. రాజకీయాల్లో ఇది వంద శాతం నిజం. తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయం చేస్తున్న కల్వకుంట్ల కవిత ఉద్యమకారిణి తరహా రాజకీయ నేత అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడే బెడిసికొట్టాయి. తెలంగాణలో కనీస ఉనికి లేని జనసేన పార్టీని ఆమె ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. రోజూ పవన్ పై విమర్శలు చేస్తూ.. అదే రాజకీయంగా గడిపేస్తున్నారు.
పీకే చెప్పింది చెవికెక్కలేదా?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా మేథోమథనం జరిపి.. తన సరికొత్త పార్టీ స్ట్రాటజీని, భవిష్యత్తు యాక్షన్ ప్లాన్‌ను, ప్రజల్లోకి వెళ్లే వినూత్న లైన్‌ను ఆమె సిద్ధం చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ప్రచారమే జరిగింది. కానీ, ఆ కాన్సెప్టులను, పీకే ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను ఆమె ఎంతవరకు ఒంటబట్టించుకున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పీకే మార్క్ పాజిటివ్ పాలిటిక్స్ ను పక్కనబెట్టి, ఆమె ఎంచుకున్న సరికొత్త పొలిటికల్ లైన్ చూసి సొంత పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయి.
పవన్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం!
తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్‌ను రగిల్చాలన్నా, రాజకీయంగా మైలేజ్ సాధించాలన్నా ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం ఒక సంప్రదాయ ఆయుధంగా వస్తోంది. చంద్రబాబును బూచిగా చూపిస్తే తెలంగాణ సమాజంలో కొంతవరకు పొలిటికల్ అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉండేది. కానీ కవిత మాత్రం ఊహించని విధంగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని తన విమర్శల పదును పెంచారు. తెలంగాణకు, ఇక్కడి రాజకీయ సమీకరణాలకు పెద్దగా సంబంధం లేని పవన్ కల్యాణ్ చుట్టూ కవిత రాజకీయం తిప్పడం వెనుక ఏ రకమైన వ్యూహం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు.
లాజిక్ లేని పోరాటం.. తోడు రాని మిత్రపక్షాలు!
పవన్ కల్యాణ్‌పై పోరాటం చేయడం వల్ల కవితకు రాజకీయంగా కలిసి వచ్చే శక్తులు గానీ, సామాజిక వర్గాలు గానీ లేవు. పవన్ కల్యాణ్ ఎక్కడో అన్న మాటలను పట్టుకుని, వాటిని తెలంగాణకు ఆపాదించి, ఇక్కడి ప్రజలను భావోద్వేగాల వైపు రెచ్చగొట్టాలని ఆమె చూస్తున్నారు. దీని ద్వారా తన వ్యక్తిగత బలాన్ని, ఉనికిని పెంచుకోవచ్చని భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆమెకు లభిస్తున్న మద్దతు శూన్యం. పవన్‌ను వ్యతిరేకించడం ద్వారా తెలంగాణలో ఎలాంటి పొలిటికల్ డివిడెండ్స్ రావనే కనీస లాజిక్‌ను కవిత మిస్ అవుతున్నారg. గతంలో లాగా ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే అరిగిపోయిన ప్రాంతీయ సెంటిమెంట్ ఆయుధం ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్దగా పనిచేయడం లేదు. ముఖ్యంగా జెన్-జీ, యువత అభివృద్ధి, ఉపాధిని కోరుకుంటున్నారు తప్ప ఇలాంటి కృత్రిమ వివాదాలను పట్టించుకోవడం లేదు.
ఆత్మవిమర్శ చేసుకోకుంటే సెల్ఫ్ గోల్ తప్పదు!
తెలంగాణలో ప్రస్తుతం ఉనికిలోనే లేని, క్షేత్రస్థాయిలో తమకు శత్రువే కాని పవన్ కల్యాణ్‌ను ఒక పెద్ద విలన్‌గా చిత్రీకరించి, ఆయనపై కవిత చేస్తున్న ఈ శైలి పోరాటం చాలా మందికి అపరిపక్వంగా, తెలివితక్కువతనంగా కనిపిస్తోంది. లేని శత్రువును సృష్టించుకుని యుద్ధం చేయడం వల్ల సమయం, శ్రమ వృథా అవ్వడమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త ఖచ్చితంగా ఇలాంటి బలహీనమైన, కాలం చెల్లిన వ్యూహాలను కవితకు రికమండ్ చేసి ఉండరనేది స్పష్టమైన వాస్తవం. పీకే ఇచ్చిన గైడెన్స్‌ను పక్కనబెట్టి, సొంత ఆలోచనలతో పవన్ కల్యాణ్‌పై అనవసర యుద్ధానికి దిగడం కవితకు సెల్ఫ్ గోల్ లాగా మారుతోంది. ఇకనైనా ఈ లేని శత్రువుల చుట్టూ తిరిగే రాజకీయాన్ని పక్కనబెట్టి.. తెలంగాణ క్షేత్రస్థాయి ప్రజా సమస్యలపై, ఇక్కడి అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిర్మాణాత్మకంగా పోరాడితేనే కవితకు పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది. లేకపోతే జనసేన పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఉనికి లేని రాజకీయం చేసుకోవాల్సి వస్తుంది.
