ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అండమాన్ నికోబార్ దీవులకు ఆజాద్ హింద్ దీవులుగా పేరు మార్చాలని ఆమె ఈ లేఖలో డిమాండ్ చేశారు. నిజానికి అండమాన్ నికోబార్ అనే పేర్లను బ్రిటీష్ వారు పెట్టారని, వలసవాదానికి చిహ్నంగా ఉన్న ఆ పేర్లను తొలగించి, దేశం కోసం పోరాడిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం మన దేశీయ పేరును పెట్టడమే సరైన గౌరవమని ఆమె పేర్కొన్నారు.
నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇప్పటికే చేస్తున్న ఈ డిమాండ్‌కు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని కవిత ప్రకటించారు. లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నేతలందరూ నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని కేవలం అభ్యర్థనకే పరిమితం చేయకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ప్రతిధ్వనించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ డిమాండ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా భారీ హాష్ ట్యాగ్ ఉద్యమం** చేపట్టనున్నట్లు కవిత తెలిపారు. అండమాన్ దీవుల పేరు మార్పు ద్వారా నేతాజీ త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ట్యాంక్ బండ్‌పై వైతాళికులకు ఆంధ్ర ముద్ర వేసి తీసేస్తామని చెప్పే కవిత.. ఇలా అండమాన్ పేరు గురించి ఉద్యమం చేస్తామని చెప్పడం కాస్త వింతగానే ఉందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
