రాజకీయం అంటేనే వ్యూహ ప్రతివ్యూహాల సమాహారం. ఇక్కడ జాలి, దయ, కుటుంబ సెంటిమెంట్లకు తావుండదు. దీనికి ఎన్నో చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి కవిత అదే చూపించబోతున్నారు. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని ఆమె విమర్శించడం అంటే, బీఆర్ఎస్ పునాదులనే ప్రశ్నించడమే. తండ్రిని సాక్షాత్తూ ద్రోహి గా చిత్రీకరించే స్థాయికి ఈ విమర్శలు వెళ్లడం వెనుక, కేవలం కోపం మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది.
ఓటు బ్యాంకుపై కన్ను
కవిత లక్ష్యం కేవలం విమర్శలు చేయడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ కేడర్‌ను, ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడం. కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గాన్ని, అలాగే పార్టీలో అసంతృప్తితో ఉన్న పాత తరం ఉద్యమకారులను ఆమె తన వైపునకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావుల కంటే తానే అసలైన రాజకీయ వారసురాలినని నిరూపించుకోవడానికి, ఆమె అన్నీ తెగతెంపులు చేసుకుని రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె చేసే దాడులను తట్టుకోవడం కేటీఆర్‌కు అత్యంత క్లిష్టమైన సవాలుగా మారనుంది.
కేసీఆర్ నిస్సహాయత
సాధారణంగా ఇలాంటి కుటుంబ కలహాల్లో పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తారు. కానీ ఇక్కడ విమర్శలు నేరుగా కేసీఆర్ పద్ధతులపైనే ఉండటంతో ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ కవితపై రివర్స్‌లో బీఆర్ఎస్ నేతలు దాడి చేస్తే, అది ఆమెకు మరింత సానుభూతిని తెచ్చిపెడుతుంది. కవిత తన తండ్రిపై చేసినట్లుగా..కుమార్తెపై తండ్రి ఆరోపణలు, విమర్శలు చేయలేరు. కేసీఆర్ మౌనం వహించినా, స్పందించినా అది రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవిత ఈ బలహీనతను సరిగ్గా వాడుకుంటున్నారు.
కేసీఆర్‌ను మించిన నేత కవిత
రాజకీయాల్లో అన్నీ వదిలేసుకుని పోరాడే వారికే కొన్నిసార్లు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కవిత ఇప్పుడు అదే ఆల్ ఆర్ నథింగ్ అనే పంథాను ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులపై ఆమె చేస్తున్న విమర్శలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది దీర్ఘకాలంలో ఆమెకు ఒక పటిష్టమైన నాయకురాలిగా గుర్తింపునిస్తుందా లేదా కుటుంబానికి దూరమైన ఒంటరి పోరాటంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఆమె వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద భూకంపమే సృష్టిస్తున్నాయి. కేసీఆర్‌ను మించిన వ్యూహకర్తగా గుర్తింపు తెస్తున్నాయి.


