భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. అయితే ఇది బీఆర్ఎస్ లో అని చెప్పడం కన్నా కేసీఆర్ కుటుంబంలో అని చెప్పడం కరెక్ట్. ఏర్పడిన వివాదం కుటుంబంలోనే తప్ప పార్టీలో కాదు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన తర్వాత తనను పూర్తిగా రాజకీయాల నుంచి దూరం చేయాలన్న వ్యూహంలో కేసీఆర్,కేటీఆర్ ఉన్నారని కవిత నమ్ముతున్నారు. అందుకే తనకు ప్రాధాన్యత కావాలని, రాజకీయ భవిష్యత్ కావాలని పట్టుబడుతున్నారు. కావాలంటే సొంత దుకాణానికి అయినా రెడీ అంటున్నారు. కానీ ఆమెకు అంత శక్తి ఉందా అన్న ప్రశ్న బీఆర్ఎస్ లోనే వినిపిస్తోంది.
కవిత ఐడెంటీటీ – కేసీఆర్ కుమార్తె !
కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కుమార్తె అని మొదట పరిచయ వాక్యం చెబుతారు ఎవరైనా. ఎక్కడైనా సరే. అంటే కవిత రాజకీయంగా తన దైన ముద్ర వేయలేకపోయారనే. కేసీఆర్ నీడలోనే ఆమె చేసిన పనులన్నీ రికార్డయ్యాయి. నిజామాబాద్ నుంచి ఎంపీగా ఒక్క సారి మాత్రమే చేశారు. రెండో సారి ఓడిపోయారు. మరోసారి పోటీ చేయలేకపోయారు. తెలంగాణ జాగృతి పేరుతో ఏం చేసినా అదంతా బీఆర్ఎస్ ఖాతాలోకే పోయింది కానీ.. కవితను ప్రత్యేకమైన నాయకురాలిగా మార్చలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆమె తిరుగుబాటును కుటుంబంలో కలహాలుగానే చూస్తున్నారు.
రాజకీయంగా ప్రభావం చూపడం కష్టం!
రాజకీయాలను పరిశీలించేవారికి..కవిత ప్రభావం నామమాత్రం అనిచాలా సులువుగా చెబుతారు. ఎందుకంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటే ఇప్పడు జాగృతిలో ఉన్న వాళ్లు కూడా ఆమెతో వస్తారా లేదా అన్నది డౌట్. బీఆర్ఎస్ నీడలో ఉంటామనే చాలా మంది ఇప్పటి వరకూ కవిత వెంట నడిచారు. ఆమెతో నడిస్తే తమకు భవిష్యత్ ఉండదనుకుంటే.. మొన్న ఎయిర్ పోర్టు వద్దకు ప్లకార్డులు పట్టుకుని వచ్చినవారు కూడా రారు. రాజకీయాల్లో స్వార్థమే మొదటి అవకాశానికి నిచ్చెన మెట్లు. కవిత కింది నుంచి రాలేదు కాబట్టి..తండ్రి నీడలో పెరిగారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకుని ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.
కవిత రిస్క్ చేయకపోవచ్చు..కేవలం పదవి హామీ కోసమే ?
కవిత సొంత పార్టీ విషయంలో టెన్షన్ పెడుతున్నా.. అంత రిస్క్ చేయకపోవచ్చని ..కేటీఆర్ కు పూర్తి బాధ్యత అప్పగించి.. తనను రాజకీయాల నుంచి దూరం చేయాలనుకుంటున్న కేసీఆర్ మనసు మార్చి..తనకూ రాజకీయ భవిష్యత్ ఉండేలా చూసుకునేందుకే ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ లో ఎక్కువగా నమ్ముతున్నారు. కేసీఆర్ ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కవిత వాస్తవాలను అర్థం చేసుకుంటారని పార్టీ పెట్టేంత రిస్క్ చేయరని కేసీఆర్ కూడా నమ్ముతున్నారని చెబుతున్నారు.