తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఆమె తండ్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ పునాదులను ఎలాగైతే పటిష్టం చేసుకున్నారో, ఇప్పుడు కవిత కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆమె ప్రస్తుత వ్యూహం మరింత జాగ్రత్తగా అమలు చేస్తున్నారు.
జాగృతిని పార్టీగా ప్రకటించేందుకు ఇంకా సమయం
ప్రస్తుతం తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ తుది దశలో ఉంది. అయితే, పార్టీ అధికారిక ప్రకటనకు సాంకేతిక సమయం పడుతున్నందున, ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలను ఆమె ఒక లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్నారు. అందుకే, పార్టీ అభ్యర్థులుగా కాకుండా తన సానుభూతిపరులను, జాగృతి కార్యకర్తలను స్వతంత్రులు గా బరిలోకి దించాలనేది ఆమె మాస్టర్ ప్లాన్. అందుకే.. పోటీ చేయడం లేదని.. కానీ అడిగిన వారికి మద్దతిస్తామని అంటున్నారు. ఇది ఒకరకంగా రిస్క్ లేని రాజకీయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గెలిస్తే జాగృతి బలం
ఈ ద్విముఖ వ్యూహంలో ప్రధాన అంశం ఏమిటంటే.. ఒకవేళ ఈ స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన స్థాయిలో విజయం సాధిస్తే, అది కవిత నాయకత్వానికి లభించిన ప్రజామోదంగా ఆమె ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, జాగృతి వైపు చూస్తున్నారని గట్టిగా వినిపించడానికి ఇది తోడ్పడుతుంది. పార్టీ ప్రకటించకముందే ఈ స్థాయిలో ప్రభావం చూపగలిగితే, భవిష్యత్తులో అదొక బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ప్రజల్లో నమ్మకం కలిగించవచ్చు.
ఓడితే అది వారి వ్యక్
మరోవైపు, ఒకవేళ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోతే, మేము అధికారికంగా పోటీ చేయలేదు, కేవలం కార్యకర్తలు వ్యక్తిగతంగా పోటీ చేశారు అని చెప్పుకుని పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా కవర్ చేసుకోవచ్చు ఈ రకమైన రాజకీయ ప్రయోగం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలాన్ని అంచనా వేయడంతో పాటు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను కూడా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఆమె సంప్రదింపులు జరుపి వ్యూహాలు ఖరారు చేసుకున్నారు. ఈ వ్యూహం వెనుక పక్కా రాజకీయ లెక్కలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా పార్టీ ముద్ర లేకుండానే బరిలోకి దిగి, ఫలితాలను బట్టి తన తదుపరి అడుగులను కవిత వేయబోతున్నారు.
