బీఆర్ఎస్ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జోరుగా జరుగుతుండగా.. ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నెగిటివ్ – పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అని కేసీఆర్ కు కవిత లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.
రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్, మైనస్ లను లేఖ ద్వారా వివరించారు కవిత. ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించడం , పహల్గం మృతులకు మౌనం పాటించాలని కోరడం , రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో పేర్కొన్నారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారు.మొత్తం ప్రసంగంలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో, భవిష్యత్ లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే సందేశం వెళ్లేందుకు కారణం అయిందని పేర్కొన్నారు. తనను జైలుపాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిల్చినదని ప్రస్తావించారు.
అలాగే , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం పట్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే, స్టేజ్ పై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలను మాట్లాడించాల్సింది అని తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు కవిత. అయితే , ఈ లేఖ ఆమె రాసిందని అంటున్నా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు కేసీఆర్ వద్ద స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని, అలాంటిది లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నారు.
అయితే, కవిత జైలు నుంచి బయటకు వచ్చాక ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అన్నయ్య మాటకు విలువ ఇవ్వకుండా కవిత వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు కవితకు డోర్లు క్లోజ్ అయ్యాయని , ఈ కారణంగానే ఆమె లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వేరు కుంపటికి రెడీ అయ్యే ఈ లేఖ రాసి ఉంటుందని అంటున్నారు.