రాజకీయ పార్టీ పెడతానని 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆమె పార్టీ పెట్టరని ఎవరూ అనుకోవడంలేదు. పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఆమె ఇంతగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. జనంబాట అని ప్రజల్లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నూ వదలడం లేదు. ఆమె తనకంటూ ఓ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. రెబల్స్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన మద్దతు ఉంటుంది. అది కొంత అయినా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కవిత పెట్టబోయే పార్టీ కి ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
కవిత చీల్చే ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీదే!
కవిత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి ప్రతి ఓటు భారత రాష్ట్ర సమితిదే అవుతుంది. ఆ పార్టీ నుంచి మాత్రమే ఓటు బ్యాంకును కవిత సంపాదించుకోగలుగుతుంది. బీజేపీ మద్దతుదారులు లేదా కాంగ్రెస్ మద్దతుదారులు, ఓటు బ్యాంకు కవిత వైపు వెళ్లే అవకాశం లేదు. కవితకూ ఈ అంశంపై స్పష్టత ఉంది. అందుకే తెలంగాణ వాదం వినిపిస్తూనే రాజకీయం చేస్తున్నారు. బీసీ ఉద్యమం చేస్తున్నారు. కవితకు తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆమె కోసం కొంత మంది ఉద్యమకారులు తరలి వస్తారు. అందులో సందేహం ఉండదు. ఎలాచూసినా ఆమె కోసం వచ్చే వారంతా.. భారత రాష్ట్ర సమితి మద్దతుదారులే అవుతారు. అలాగే ఓట్లు వేసేవారు కూడా.
తెలంగాణ రాజకీయాలు సంక్లిష్టం- రెండు,మూడు శాతం తేడాతో పాతాళంలోకి!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో సంకుల సమరం సాగుతుంది. ఓ వైపు బీఆర్ఎస్, మరో వైపు బీజేపీ.. అధికార పార్టీగా కాంగ్రెస్ హోరాహోరీగా తలపడతాయి. ఆ పార్టీల మధ్యలో కవిత పార్టీ తన ఉనికి కోసం పోటీ పడుతుంది. ఎలా చూసినా కవిత పార్టీకి మూడు శాతం ఓట్లు వస్తాయనుకుందాం. ఆ మూడు శాతం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతాయి. హోరాహోరీ పోరులో మూడు శాతం బీఆర్ఎస్ ఓట్లు కవిత పార్టీ చీరిస్తే.. ఆ పార్టీ అభ్యర్థులు బలమైన చోట్ల కూడా గెలుపొందడం కష్టమవుతుంది. కడప జిల్లాలో షర్మిల దెబ్బకు వైసీపీ ఏడు చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. షర్మిల వల్ల వైసీపీ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. తెలంగాణనూ అదే జరుగుతోంది.
కవితతో పంచాయతీ పెంచుకోకపోవడం ఉత్తమం !
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితను టార్గెట్ చేస్తున్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నారు. అది ఆమె రాజకీయ వ్యూహం. ఆ విషయం బీఆర్ఎస్ నేతలకూ స్పష్టత ఉంది. ఆమె అటెన్షన్ రాణి అని విమర్శిస్తున్నారు. అయినా టార్గెట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఆమె ఇలాంటి విషయాలను అడ్వాంటేజ్ గా తీసుకుని మరింత రాజకీయం చేస్తున్నారు. దాని వల్ల కవితకే పబ్లిసటీ వస్తోంది. ఆమె కరెక్ట్ లైన్ లోనే ఉన్నారు. కానీ కవిత వల్ల తమకు జరగబోయే ముప్పును అంచనా వేయలేని బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు అయినా కవితతో రాజీ చేసుకుంటేనే బీఆర్ఎస్ కు మేలు. ఈగోకు పోతే.. అంతా అయిపోయిన తరవాత చక్కదిద్దుకుందామని ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు.
