బీఆర్ఎస్ పార్టీ తనదేనని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. టీవీ5 సీఈవో మూర్తి .. కవితతో పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఆ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందులో కవిత తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఏ మాత్రం సందేహించకుండా బయట పెట్టారు. కొత్త పార్టీ ఆలోచనల్లేవు అని బలంగా చెప్పారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ తనదేనని ఆమె బలంగా చెప్పారు. అదే సమయంలో పార్టీలో తనకెదురైనా, ఎదురవుతున్న పరిస్థితులు.. తండ్రి కూడా నిరాదరించడం వంటి వాటిని కవిత వివరించారు.
కేటీఆర్‌తో మాటల్లేవు !
కుటుంబంలో ఉన్న వివాదాలపై కవిత నేరుగా స్పందించారు. కేటీఆర్‌తో తనకు మాటలు లేవన్న విషయాన్ని అంగీకరించారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత తాను ఎవరినీ నాయకుడిగా అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఇంటర్నల్‌గా మాట్లాడాలని కేటీఆర్ అంటున్నారని..తాను ఇంటర్నల్ గా మాట్లాడినవన్నీ బయటకు వస్తున్నాయన్నారు. తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని కవిత .. నేరుగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. తన అనుచరుల్ని పార్టీ కార్యాలయానికి రానివ్వట్లేదని.. కవిత మనుషులకు తెలంగాణ భవన్ లో పనేమిటని పంపిచేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీకి దూరం చేసేందుకు ఓ శక్తి బలంగా ప్రయత్నిస్తోందని కవిత అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫోన్లు ట్యాప్ అయ్యాయి..కానీ కేసీఆర్‌కు తెలియకపోవచ్చు !
సోషల్ మీడియాలపై తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, ట్రోల్స్ గురించి తన తండ్రికి కవిత చెప్పానన్నారు. సొంత పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఆపాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత బాధపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ కవిత నిక్కచ్చిగా మాట్లాడారు. తన సన్నిహితులకు సిట్ అధికారులు ఫోన్లు చేసి.. వాంగ్మూలం ఇవ్వాలని కోరారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది కానీ దానికి తన తండ్రి కేసీఆర్ కు సంబంధం ఉందని అనుకోవడం లేదని.. ఆయన గొప్పవారన్నారు. సమయమే అన్నింటికీ జవాబు చెబుతుందన్నారు.
పార్టీ నాది.. నిర్మాణంలో నా పాత్ర ఉంది !
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలపైనా స్పందించారు. ఆ దెయ్యాలు ఎవరు అన్నది నేరుగా చెప్పలేదు కానీ.. ఈ ప్రశ్నకు సమాధానంలో సంతోషం అనే మాటను కొన్ని సార్లు ఉపయోగించారు. దీంతో ఆ దెయ్యం.. సంతోష్ రావు అయి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో తన పాత్ర ఉందని.. ఇక ముందు కూడా ఉంటుందని.. బీఆర్ఎస్ పార్టీ తనదని.. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ పయనం విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పాడ్ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.