భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వివరణలు తీసుకోవడం లాంటి ప్రాసెస్ ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా ఒకే సారి సస్పెన్షన్ వేటు వేశారు.
కవితపై చర్యలు తీసుకుంటారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడినప్పటి నుండి ఈ ప్రచారం జరుగుతోంది. కానీ కేసీఆర్ ఆలోచిస్తూ వస్తున్నారు. చివరికి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిర్దారించేలా మాట్లాడుతూ తప్పు అంతా హరీష్, సంతోష్ ల మీద వేస్తూ విమర్శలు గుప్పించారు. ఇది పార్టీ నాయకత్వానికి సమస్యగా మారింది.
కవితపై చర్యలు తీసుకోకపోతే.. హరీష్ రావును అవమానించినట్లుగా.. తీసుకుంటే కేసీఆర్ కుమార్తె ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు అవుతుంది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి సమస్య బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. చివరికి కవితను బయటకు పంపాలని నిర్ణయించుకున్నారు. కవిత కూడా ఇలాంటి పరిస్థితికి ముందుగానే సిద్ధమయ్యారు. తెలంగాణ జాగృతిని రెడీ చేసుకున్నారు. ఆమెను జాగృతినే ప్రత్యేక పార్టీగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
కవితను పార్టీ నుంచి బహిష్కరించడంతో కల్వకుంట్ల కుటుంబం రెండుగా చీలినట్లయింది. కేసీఆర్ కు ఈ పరిస్థితి మానసికంగా ఇబ్బంది పెట్టేదే అవుతుంది. కవిత జైలుకెళ్లినప్పుడు ఒక్క సారి కూడా పరామర్శించలేదు. .వెళ్లి వచ్చాక పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. చివరికి ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.