దశాబ్దాలుగా సిద్ధిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్ధిపేట అన్నట్లుగా సాగిన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సిద్ధిపేట గడ్డపై నిలబడి, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆ అభ్యర్థిని నేరుగా మంత్రిని చేస్తాను అని ప్రకటించడం హరీష్ రావును గట్టిగానే కలవరపెడుతోంది. సాధారణంగా కూల్‌గా ఉండే హరీష్, రేవంత్ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో విరుచుకుపడుతూ నువ్వే వచ్చి పోటీ చెయ్ అని సవాల్ విసరడం వెనుక బలమైన కారణం ఉంది.
సొంత ఇంటి పోరు: బావ కోటపై కవిత కన్ను?
హరీష్ రావును కేవలం బయటి శత్రువులే కాదు, ఇంటి శత్రువులు కూడా ఇరకాటంలో పెడుతున్నారు. శ్రీరామనవమి నాడు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్న కవిత, తన రాజకీయ ప్రస్థానానికి సిద్ధిపేటను వేదికగా ఎంచుకోవాలని చూడటం హరీష్‌కు మింగుడు పడటం లేదు. సిద్ధిపేట కేసీఆర్ రాజకీయ జన్మస్థలం కాబట్టి, ఆ వారసత్వంపై తనకే హక్కు ఉందని కవిత భావిస్తున్నారు. ఆమె అక్కడ బరిలోకి దిగితే బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోవడం ఖాయం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు తలపడితే, అది అంతిమంగా కాంగ్రెస్‌కు రెడ్ కార్పెట్ వేసినట్లు అవుతుందనే భయం హరీష్ రావును వెంటాడుతోంది.
మహిళా రిజర్వేషన్ గండం కూడా
రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే, సిద్ధిపేట వంటి కీలక స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం మెండుగా ఉంది. ఇదే జరిగితే హరీష్ రావు తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను కవిత తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ సిద్ధిపేట మహిళా కోటాలోకి వెళ్తే, తెలంగాణ ఆడబిడ్డ గా అక్కడ పోటీ చేయడం కవితకు అత్యంత సులభం అవుతుంది. మహిళా ఓటర్ల మద్దతుతో పాటు, సామాజిక సమీకరణాలు కూడా తోడైతే హరీష్ రావు రాజకీయ ప్రస్థానానికి అది పెద్ద బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది.
ట్రబుల్ షూటర్‌కే తప్పని ట్రబుల్స్
ఎప్పుడు పార్టీకి ఏ కష్టం వచ్చినా గట్టెక్కించే ‘ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఇప్పుడు గట్టిగా ఎదురుదాడిరాజకీయాల్ని నమ్ముకోవాల్సి వస్తోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి నిధుల కోత విధిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు కవిత రూపంలో వస్తున్న ఇంటిపోరును తట్టుకోవడం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. సిద్ధిపేట కోటను బద్దలు కొట్టడానికి అటు రేవంత్, ఇటు కవిత సిద్ధమవ్వడంతో హరీష్ రావు కూడా వారి వ్యూహాలకు తగ్గట్లుగా తన రాజకీయాలు మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు.


