తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టి.ఆర్.ఎస్ అనే మూడక్షరాల సెంటిమెంట్ పేరు మరోసారి మార్మోగబోతోంది. తెలంగాణ సాధన ఉద్యమంలో మరియు ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయిన TRS అనే సెంటిమెంట్‌ను తిరిగి సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కవిత తన రాజకీయ పునరాగమనాన్ని ప్లాన్ చేశారు. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయం కోసం టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చడం చారిత్రాత్మక తప్పిదమని, ఆ పేరు మార్పు వల్లే పార్టీ తన ఆత్మను, తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కోల్పోయిందని ఆమె బలంగా నమ్ముతున్నారు. గులాబీ కనిపించకుండా పసుపు పూయగలనని ఆమె నమ్ముతున్నారు.
గ్రామస్థాయికి టీఆర్ఎస్ పార్టీ
ఈ సెంటిమెంట్‌ను కేవలం హైదరాబాద్ వేదికలకే పరిమితం చేయకుండా గ్రామాల్లోకి, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవిత అత్యంత వ్యూహాత్మకంగా జెండా పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక జెండా స్తంభం నమూనాను ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే ఈ జెండా పండుగ ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగురవేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ను ఆకర్షించడమే లక్ష్యం
కవిత వేస్తున్న ఈ అడుగులు నేరుగా కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఒక బహిరంగ హెచ్చరిక లాంటివి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత బిఆర్ఎస్ బలహీనపడిన తరుణంలో, ఆ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తానేనని కవిత నిరూపించాలనుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై, అటు క్షేత్రస్థాయిని వదిలేసిన బిఆర్ఎస్ నాయకత్వంపై ఒకేసారి ద్విముఖ దాడి చేస్తూ ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, మహిళలు , యువతను టార్గెట్ చేస్తూ స్థానిక మట్టి సెంటిమెంట్‌ను ఆమె నమ్ముకున్నారు.
కవితను కేసీఆర్ విమర్శించకపోవడమూ ప్లస్సే
దశాబ్దాలుగా కేసీఆర్ బొమ్మతో నడిచిన ఉద్యమ సెంటిమెంట్‌ను, ఇప్పుడు కేవలం ఒక కొత్త పేరుతో ఆమె ఎంతవరకు రీ-క్రియేట్ చేయగలరనేది పెద్ద ప్రశ్న. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ క్షేత్రస్థాయిని శాసిస్తుండగా, మరోవైపు బెంగాల్ విజయం తర్వాత దూకుడుగా ఉన్న బీజేపీ కమలం జెండాను పల్లెల్లోకి తీసుకెళ్తోంది. ఇటువంటి త్రిముఖ, చతుర్ముఖ పోటీల మధ్య తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, బిఆర్ఎస్ అసంతృప్త కేడర్ కవిత వైపు ఎంతమేర మొగ్గు చూపుతుందనే దానిపైనే రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ ల్యాండ్‌స్కేప్ ఆధారపడి ఉంటుంది. కేసీఆర్.. కవిత పార్టీపై ఇప్పటి వరకూ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడమూ కవితకు ప్లస్ అవుతుంది.
