కల్వకుంట్ల కవిత మరో షర్మిల అవుతుందని మీడియా, సోషల్ మీడియాలో రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. ఇది కాంప్లిమెంట్ అవుతుందా లేకపోతే హెచ్చరికా అన్నది మాత్రం చాలా మందికి అర్థం కావడం లేదు. షర్మిలలా అన్నను ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకుంటారన్న వరకే వీరు విశ్లేషిస్తున్నారేమో కానీ.. షర్మిల అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడం మాత్రం అందరికీ గుర్తుకు వస్తోంది.
ఏపీలో జగన్ రెడ్డి తన సోదరికి తీవ్ర అన్యాయం చేశారు. చివరికి ఆస్తులు కూడా ఇవ్వలేదు. అందుకే ఆమె పార్టీ పెట్టుకున్నారు. అన్నపై తాడోపేడో తేల్చుకుంటున్నారు. కానీ రాజకీయంగా ఆమె ప్రభావం పెద్దగా లేదు. కనీసం ఐదు శాతం ఓట్లు తెచ్చుకుంటే జగన్ రెడ్డికి రాజకీయంగా శాశ్వతంగా నష్టం చేయవచ్చు.కానీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ కొంత దెబ్బకొట్టారు.దాని వల్ల షర్మిల రాజకీయంగా లాభపడలేదు.
షర్మిలతో పోలిస్తే కవితకు ఉండే ప్లస్ పాయింట్లు తక్కువే. అయితే షర్మిల కన్నా దూకుడైన నేతగా ఆమె గుర్తింపు పొందారు. జగన్ రెడ్డి షర్మిల ను రాజకీయంగా ఎదగకుండా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు.కానీ కవిత మొదటి నుంచి తెలంగాణ జాగృతిని నడుపుతూ తన నాయకత్వ లక్షణాలను చూపించుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టినా ఆమె దాన్ని సమర్థంగా నడుపుకోగలరు. కానీ ప్రజా మద్దతు ఎంత వరకూ సాధించగలుగుతారన్నది కీలకం.
షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలిచ్చినా.. హైకమాండ్ నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారు. కవిత కాంగ్రెస్ లో చేరితే అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కొంత మంది ఆమె కాంగ్రెస్ లో చేయవచ్చని కూడా అంటున్నారు. అందుకే మరో షర్మిల అనే పోలిక కవితకు ఇబ్బందికరమే.