భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేశారు. బహిష్కరణ కాదు.. సస్పెన్షనే అని కొంత మంది అంటున్నారు కానీ కవిత రెండింటిని సమానంగా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇక తనకు భారత రాష్ట్ర సమితితో రుణం తీరిపోయిందని డిసైడయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అనుకున్న సమయం వచ్చింది. అందుకే తన బాటలో తాను పయనించబోతున్నారు. ఎమ్మెల్సీ సహా పదవులన్నింటికీ రాజీనామా చేసి కొత్త రాజకీయ మార్గంలోకి చేరబోతున్నారు.
సొంత పార్టీ ఖాయం !
కవిత కొన్నాళ్లుగా చేస్తున్న రాజకీయాలను విశ్లేషిస్తే ఆమె సొంత పార్టీ దారిలో ఉన్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ జాగృతిని ఆమె బలోపేతం చేసుకున్నారు. సొంత నేతల్ని తయారు చేసుకునేందుకు యువకులకు శిక్షణ ఇప్పించారు. రాజకీయంగా ఆసక్తి ఉండి అవకాశాలు రాని యువతను జాగృతి వైపు ఆకట్టుకునేలా చేశారు. కవితకు ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉండకపోవచ్చు కానీ.. ఆమె పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన క్యాడర్ ను మాత్రం సమకూర్చుకున్నారు. బీసీ నినాదంతో కొంత మందిని ప్రోత్సహించారు. ఇప్పుడు వారంతా కవితకు అండగా ఉంటారు.
బీఆర్ఎస్లో రాజకీయ భవిష్యత్ లేదనే నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లి వచ్చిన తరవాత ఆమెను రాజకీయాల నుంచి విరమించుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చింది. పార్టీలో మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న కేటీఆర్ లక్ష్యం, కేసీఆర్ సైతం కవిత రాజకీయాలపై అనాసక్తిగా ఉండటంతో పాటు మొత్తం అందరూ .. కవితకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు మరో మార్గం లేకుండా పోయింది. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆమెకు పిలుపుల్లేవు. అందుకే జాగృతి పేరుతో సొంత రాజకీయాలు చేశారు. చివరికి ఏదో ఓ సందర్భంలో తనను బయటకు పంపేలా చేస్తారని.. అప్పుడు పార్టీ దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధంగా అంతా తాను అనుకున్నట్లుగానే చేశారు.
కవిత రాజకీయ ప్రభావం ఎంత ?
కవిత ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారు. సొంత రాజకీయాలు చేస్తారు.. అయితే ఆమె ప్రభావం ఎంత అన్నదానిపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆమె షర్మిలలా ఘోరమైన ఫ్లాప్ అవుతారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలోఆమె పాత్ర.. ఆమె నాయకత్వ శైలి ని విశ్లేషించిన కొంత మంది తీసిపారేయలేమని అంటున్నారు. అయితే ఆమె గెలవకపోవచ్చు కానీ బీఆర్ఎస్ పతనంలో ఆమె పాత్ర కీలకం అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అసలే చిక్కిపోతున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో మూడు ,నాలుగు శాతం కవిత ఖాతాలోకి వెళ్లినా బీఆర్ఎస్ కోలుకోవడం అసాధ్యం అవుతుంది.