భారత రాష్ట్ర సమితిలో కవిత బాంబు వెలిగించారు. పార్టీకి పిల్లర్లుగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారి వల్లే అంతా జరుగుతోందని.. వారిద్దరూ పెద్ద అవినీతి పరులని తేల్చేశారు. సంతోష్ రావు విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నా.. హరీష్ రావుపై మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీలో మొదటి సారి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరంపై అవినీతి విషయంలో కేవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. అవినీతి జరగలేదని ఆమె చెప్పలేదు సరి కదా.. జరిగిందని అంగీకరిస్తూ.. దానికి తన తండ్రి బాధ్యుడు కాదని హరీష్ రావు, సంతోష్ రావే బాధ్యులన్నారు. అవినీతి గురించి తెలుసు కాబట్టే రెండో టెర్మ్ లో కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదన్నారు.
కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ హరీష్ ,సంతోష్ లపై మాత్రం పెద్ద బాంబే వేశారు. ఇది చిన్న విషయం కాదు. వీరిపై పార్టీ నేతల్లో.. ముఖ్యంగా అగ్రనేతల్లో అనుమానాలు ప్రారంభమైతే.. అది అంతకంతకూ పెద్దది అవుతుంది. చివరికి పేలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీని కకావికలం చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ చాలా వేగంగా స్పందించింది. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థించడం లేదని అర్థం వచ్చేలా హరీష్ ను పొగుడుతూ ఓ వీడియోను అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టు చేశారు.
అసలే కాళేశ్వరం రిపోర్టు ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత చేస్తున్న రాజకీయం పెను సమస్యగా మారుతోంది. పార్టీలో ముఖ్య నేతల మధ్య ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగేలా కవిత ఆరోపణలు చేస్తున్నారు. పేర్లు నేరుగా చెప్పడం మాత్రమే కాదు.. వారి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా చెబుతున్నారు. కటుంబ రాజకీయాల్లో ముఖ్యంగా కేసీఆర్, కవిత, కేటీఆర్ మధ్య జరిగే రాజకీయాల్లో హరీష్ రావు ఎప్పుడూ జోక్యం చేసుకున్నట్లుగా ప్రచారం జరగలేదు.కానీ అనూహ్యంగా హరీష్ రావు పేరును కవిత తెరపైకి తెచ్చారు.
కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు రావడం, సీబీఐ ఎంక్వైయిరీ జరుగుతుందని ప్రచారంజరుగుతూండటాన్ని కవిత వ్యూహాత్మకంగా తన రాజకీయానికి ఉపయోగించుకున్నారు. కేసీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్న వారిని టార్గెట్ చేశారు. కవిత రాజకీయం భారత రాష్ట్ర సమితిలో ఎలాంటి పరిమణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.