ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు రాజకీయంగా పునర్జన్మ లభించినట్లయింది. బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ తీర్పు మింగుడుపడని పరిణామమే. ఆమె జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పరామర్శించకపోవడం, పార్టీ పరంగా కనీస మద్దతు లభించకపోవడం వంటి అంశాలను కవిత ఇప్పుడు తన సానుభూతి అస్త్రాలుగా మలచుకోనున్నారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం నన్ను బలిపశువును చేశారు అనే నెరేటివ్‌ను ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ
తీర్పు వచ్చిన వెంటనే కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మహిళా లోకాన్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా.. తాను కేవలం ఒక నాయకురాలినే కాకుండా, ఒక పోరాట యోధురాలినని నిరూపించుకోవాలని ఆమె చూస్తున్నారు. బీఆర్ఎస్ పక్కన పెట్టిన తెలంగాణ అజెండా ను మళ్లీ భుజాన ఎత్తుకోవడం ద్వారా గులాబీ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే ఆమె ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
చిన్న నిందను భరించడానికి సిద్ధంగా లేని కవిత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్వీట్లో పార్టీ నష్టపోయింది అని పేర్కొనడాన్ని కవిత తీవ్రంగా ఆక్షేపించారు. పార్టీ ఓటమికి తనను బాధ్యురాలిని చేయడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నుంచి వచ్చిన నిరాదరణే ఇప్పుడు ఆమెను సొంత రాజకీయ ప్రస్థానం వైపు నడిపించింది. కేవలం రాజకీయంగానే కాకుండా, కుటుంబ పరంగా కూడా ఆమె ఇప్పుడు ఒక స్వతంత్ర శక్తి ‘గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మున్ముందు బీఆర్ఎస్కు అతిపెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ కన్నా సానుభూతి ఎక్కువ వస్తే కష్టమే !
క్లీన్ చిట్ రావడంతో కవితకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇప్పుడు ఆమె లక్ష్యం కేవలం తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడమే కాదు, తన రాజకీయ ఉనికిని చాటుకోవడం. తెలంగాణ జాగృతి ద్వారా క్షేత్రస్థాయిలో ఆమెకు ఉన్న నెట్వర్క్, ఇప్పుడు తోడైన నిర్దోషి అనే ముద్ర ఆమెకు రాజకీయంగా కలిసొచ్చే అంశాలు. ఒకప్పుడు కేసుల వల్ల పార్టీకి భారం అనిపించిన కవితే, ఇప్పుడు అదే పార్టీకి సమాంతరంగా నిలబడి ముచ్చెమటలు పట్టించే స్థాయికి చేరుకున్నారు.
