భారతరాష్ట్ర సమితి కుటుంబంలో ఏర్పడిన వివాదంలో కవిత ఒంటరి అయ్యారు. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడమే కాకుండా.. కుటుంబసభ్యురాలిగా కూడా చూడటం లేదు. ఇలా జరగడానికి తెర వెనుక చాలా జరిగి ఉంటాయని అందరికీ తెలుసు. కానీ అవేంటో ఆ ఫ్యామిలీలోని వారికి మాత్రమే తెలుసు. కేసీఆర్ తన కుమార్తెను కూడా దూరం చేసుకున్నారు. ఇప్పుడు మాటలు కూడా లేవు. కానీ కుమార్తె కవిత మాత్రం కేసీఆర్ ను పల్లెత్తు మాట అనడం లేదు. మొదట్లో కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేసినా ఇప్పుడు పూర్తిగా హరీష్ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఆయన పై లెక్కలేనన్ని ఆరోపణలు చేస్తున్నారు. గట్టిగా ఖండించలేని పరిస్థితిలో హరీష్ రావు ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కవిత మరింత ఎటాక్ చేస్తున్నారు. అసలు హరీష్‌కు.. కవితకు ఎందుకు చెడింది?
హరీష్ పై కవిత వేస్తున్నవన్నీ నిందలే !
హరీష్ రావుపై కవిత ఇటీవలి కాలంలో చాలా ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్లు కూడా ఆయన తీసుకున్నారని వరంగల్ ఆస్పత్రి కాంట్రాక్రర్ ఆయనేనని.. అలాగే పాల వ్యాపారం, ఫాం హౌస్, రిసార్టు, రేవంత్ రెడ్డితో బిజినెస్ వ్యవహారాలు ఇలా కవిత లెక్కలేనన్ని ఆరోపణలు చేస్తున్నారు. కాని హరీష్ రావుకు అంత భారీ ఆర్థిక సామ్రాజ్యం ఉందని సామాన్య బీఆర్ఎస్ కార్యకర్త నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే హరీష్ రావు.. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి అందరికీ తెలుసు. ఆయన తీరు ఎలా ఉంటుందో కూడా తెలుసు. అందుకే నమ్మలేకపోతున్నారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్న కవిత.. ఒక్క ఆధారం కూడా బయట పెట్టడం లేదు.
కౌంటర్ ఇవ్వలేని స్థితిలో హరీష్ రావు
కవిత తన క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నా హరీష్ రావు స్పందించడం లేదు. మొదట్లో ఒక్క సారి మాత్రం కవిత ఆరోపణల్ని సాదాసీదాగా ఖండించారు. తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. నిజానికి ఆయన స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అందుకే కవిత ఆరోపణలను మౌనంగానే భరిస్తున్నారు. కవితకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఇంకా పెద్ద విషయం అవుతుంది. కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. అందుకే హరీష్ రావు పూర్తి సంయమనం పాటిస్తున్నారు.
హరీష్ ను బీఆర్ఎస్కు దూరం చేయాలన్నదే కవిత ప్లాన్
కవిత రాజకీయాలు పూర్తిగా హరీష్ ను టార్గెట్ చేయడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉందన్న అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కారణం ముందుగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపడం. బీఆర్ఎస్ పార్టీ పిల్లర్లలోఒకరు హరీష్ రావు. ఆయన కేవలం కేసీఆర్ మేనల్లుడు అన్న కారణంగా నిలబడలేదు. హరీష్ కు పక్కా రాజకీయం తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో ఇంకా బాగా తెలుసు. అందుకే ఆయన నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ లో ఆయన పై పూర్తిగా విశ్వాసం తగ్గిపోయేలా చేసి.. బయటకు పంపిస్తే బీఆర్ఎస్ పార్టీ సగం బలహీనపడుతుంది. హరీష్ సొంత పార్టీ పెట్టుకుంటే ముప్పావు శాతం బలహీనపడుతుంది. కవిత అదే కావాలి అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. అంటే హరీష్ రావును టార్గెట్ చేస్తోంది.. ఆయనపై కోపంతో కాదు.. బీఆర్ఎస్ ను బలహీనం చేయాలన్నఉద్దేశంతోనే. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా..?. హరీష్ కు.. కేటీఆర్, కేసీఆర్‌లకు మధ్య అనుబంధంలో కనిపించని పగుళ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కవిత తన రాజకీయంతో వాటిని నెర్రలు చేసి .. వారిని దూరం చేస్తే ఆమె రాజకీయం సక్సెస్ అయినట్లే.
