కాళేశ్వరం రిపోర్టును అడ్డం పెట్టుకుని తమకు జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కేసీఆర్, హరీష్ రావు గట్టిగా నమ్ముతున్నారు. ఆ నివేదిక అసెంబ్లీలో పెడితే ఇక తాము కూడా ఆమోదించినట్లే అవుతుందని వెంటనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని వారిద్దరూ పిటిషన్లో కోరారు. కేవలం రాజకీయ పరమైన కక్ష సాధింపుల కోసమే కమిషన్ ఏర్పాటు చేశారని.. ఆ కమిషన్ కు చట్టబద్ధత లేదని కేసీఆర్, హరీష్ తమ పిటిషన్లలోపేర్కొన్నారు. వీరి పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెట్టి విస్తృతంగా చర్చిస్తామని రేవంత్ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి 650పేజీల నివేదికను ఇస్తామన్నారు. అందరూ దానిలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చిద్దామని.. తర్వాత చర్యల విషయం అసెంబ్లీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే అసెంబ్లీలోపెట్టే వరకూ ఆగితే ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో కోర్టుల పరిధి దాటిపోతాయని కేసీఆర్, హరీష్ రావు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పిటిషన్ల వేశారు.
నిజానికి కేసీఆర్ ను అరెస్టు చేయబోమని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఈ మాటను బీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదు. తర్వాత పోలీసులు అరెస్టు చేస్తే తన ప్రమేయం లేదని చెప్పుకోవడానికి.. రాజకీయంగా కక్ష సాధింపు లేదని ప్రజల వద్ద వాదించుకోవడానికి ఆయన అలా చెప్పారని అనుమానిస్తున్నారు. కేసీఆర్,హరీష్ ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బతీయవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అందుకే రిపోర్టే చట్ట విరుద్ధమని వాదించాలని డిసైడయ్యారు.
అయితే కేసీఆర్, హరీష్ ముందే వ్యూహాత్మక తప్పిదం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారు కమిషన్ పరిధిని అంగీకరించి .. ఆ కమిషన్ ఎదుట హాజరయ్యారు కూడా. ఇప్పుడు చట్టవిరుద్ధమని హైకోర్టులో ఎలా వాదిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.