తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది అత్యంత కీలక అంశంగా మారింది. కేసీఆర్ చేసిన అప్పుల కారణంగా దివాలా తీసేశామని వస్తున్న ఆదాయానికి.. చేస్తున్న ఖర్చునకు పొంతన లేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు దొంగల్లాగా చూస్తున్నాయని అంటున్నారు. రోడ్లు కూడా వేయలేకపోతున్నామని అంటున్నారు. ఆయన మాటలు వింటున్న వారికి గతంలో కేసీఆర్ మాటలు గుర్తు రాక ఉండవు. అప్పట్లో కేసీఆర్ … యస్ తెలంగాణ రిచ్ స్టేట్. బోలెడన్ని అప్పులు ఇస్తున్నారు.. తీసుకుంటున్నాం అని చెప్పేవారు. తెలంగాణ విషయంలో ఈ ఇద్దరు నాయకుల తీరు భిన్నమని తేలిపోతోంది.
అప్పట్లో కేసీఆర్ డైలాగ్ – తెలంగాణ రిచ్
దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ. అప్పులు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు వెంట పడుతున్నాయి. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ.. వాటిని సద్వినియోగం చేయడం కీలకమని అసెంబ్లీలో ప్రసంగించేవారు. ధనిక రాష్ట్రం అన్న హోదాను మెయిన్ టెయిన్ చేసేవారు. అంతా లగ్జరీగా ఉండేలా చూసుకునేవారు. దేశంలో ఏ రాష్ట్రం కట్టని అత్యంత భారీ ప్రాజెక్టు కట్టారు. హైదారబాద్ మౌలిక సదుపాయాలు ఊహించనంతగా మెరుగుపరిచారు. ఆయన మంచి చేశాడా .. చెడు చేశాడా అన్నదానిపై అనేక విశ్లేషణలు రావొచ్చు కానీ.. ఆయన వాదన మాత్రం ఒకటే .. అదే తెలంగాణ రిచ్ .
ఇప్పుడు రేవంత్.. అప్పుల తెలంగాణ !
అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన తర్వాత తెలంగాణ అప్పుల పాలయిందని వాదిస్తున్నారు. ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అంటున్నారు. వాటిని తీర్చడానికి, కిస్తీలు కట్టడానికి డబ్బులు సరిపోవడం లేదని అంటున్నారు. ఎప్పుడు.. ఏ సందర్భం అయినా ఆయన తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకుండా ఉండటం లేదు. అప్పట్లో కేసీఆర్ అప్పులు ఇచ్చేందుకు చాలా మంది వస్తున్నారని అనేవారు కానీ ఇప్పుడు రేవంత్ అప్పులు పుట్టడం లేదని.. దొంగల్లా చూస్తున్నారని అంటున్నారు. పడిపోయిన పరపతిని ఇది సూచిస్తుందని అనుకోవచ్చు.
స్ట్రాటజీల్లోనే మార్పు – ఎవరి వాదన వారిది !
కేసీఆర్ తెలంగణను రిచ్ స్టేట్ గా ప్రొజెక్ట్ చేసినా.. రేవంత్ తెలంగాణను పూర్ స్టేట్ గా .. అప్పులతో తెలంగాణ దివాలా దిశగా వెళ్తోందని చెప్పినా అది వారి రాజకీయ విధానాల ప్రకారమే జరుగుతుంది. ఓ కుటుంబం ఆదాయం, అప్పులు, ఖర్చులను ఎలా బ్యాలెన్స్ చేయాలో.. అలాగే రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేయాలి. హామీలను అమలు చేసుకోవాలి. ఈ క్రమంలో కేసీఆర్ నింపాదిగా ఉంటే… రేవంత్ మాత్రం కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోందని అనుకోవచ్చు. కేసీఆర్ ఉద్యోగుల సమ్మెలు లాంటివి చాలా చూశారు కానీ..ఆయన డీల్ చేసిన విధానం వేరు.. రేవంత్ డీల్ చేస్తున్న విధానం వేరు ?. ఎవరిది బెటర్ అన్నది ఎవరూ చెప్పలేరు.