భారత రాష్ట్ర సమితి రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు అందరికీ ఒకటే సందేహం వినిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నంతా కేసీఆర్ స్క్రిప్ట్ కావొచ్చన్నదే ఆ సందేహం. కవితతో కావాలనే కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని.. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. హరీష్ రావు ఇమేజ్ను దెబ్బతీసి పార్టీ నుంచి బయటకు పంపడం దగ్గర నుంచి బీజేపీలో పార్టీ విలీనం వరకూ చాలా వ్యూహాలు కేసీఆర్‌కు ఉన్నాయని అందుకే కవితను బయటకు పంపేసి.. కొత్త రాజకీయం చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
హరీష్‌ను నిర్వీర్యం చేసే రాజకీయం
హరీష్ రావు పార్టీలో కీలక నేత. ఎంతగా అంటే.. పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనే లీడర్లు, క్యాడర్‌ను సమన్వయం చేశారు. ప్రతి జిల్లాలో నేతలంతా ఆయనకు పరిచయం. రేపు తేడా వస్తే.. పార్టీ క్యాడర్ సగం హరీష్ వెంట వెళ్తుంది. హరీష్ ను కేవలం మెదక్ జిల్లాకు పరిమితం చేసి చాలా కాలం అయినా… కేటీఆర్ బాధ్యతలు తీసుకుని చాలా కాలం అయినా.. పరిస్థితిలో మార్పు లేదు. కేటీఆర్ అనుకున్నంతగా పార్టీపై పట్టు సాధించలేదు సరి కదా… అహంకార ధోరణితో సొంత పార్టీలోనే కొంత మందికి వ్యతిరేకమయ్యారు. వారు సమయం వచ్చినప్పుడు బయట పడతారన్న అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ ఇమేజ్ ను ప్రజల్లో వీలైనంతగా పలుచన చేయాలన్న లక్ష్యంతోనే…ఎవరు చెబితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందో.. వారితో చెప్పించేందుకు కవితను రంగంలోకి దించినట్లుగా అనుమానిస్తున్నారు. కవిత ఆరోపణల తర్వాత ఇప్పుడు హరీష్ రావుపై సోషల్ మీడియాలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళ కిందట ఆయన ట్రంకుపెట్టె, రబ్బరు చెప్పులతో కేసీఆర్ వద్దకు వచ్చారని..ఇప్పుడు ఆయన ఆర్థిక స్థాయి ఎంత.. ఎలా సంపాదించారన్న ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రాను రాను పెరగనున్నాయి. కవిత టార్గెట్ హరీష్ గానే ఫిక్సయ్యారు.
బీజేపీలో విలీనం చేయాల్సి వస్తే మరో పార్టీ ?
అదే సమయంలో కవితతో కేసీఆరే రాజకీయం చేయిస్తున్నారన్నదానికి మరో ప్రధాన కారణం బీజేపీలో విలీనం. పార్టీని కాపాడుకోవడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ తమ పార్టీని బలవంతంగానో.. ఇష్టపూర్వకంగానో విలీనం చేయించుకుంటుంది. ఆ తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ ఇస్తే సరే లేకపోతే లేదు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి.. కేటీఆర్ ను మాత్రమే యాక్టివ్ గా ఉండమని బీజేపీ చెప్పే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయాలను చూస్తే..తర్వాత కేటీఆర్ నూ ద్వితీయశ్రేణి నాయకుడిగా మార్చేస్తారు. అందుకే… పార్టీని విలీనం చేయాల్సి వస్తే. .. తమ కుటుంబం నుంచి ఓ పార్టీ ప్రజల్లో ఉండాలన్న టార్గెట్ తో.. కేసీఆర్ కవితతో వ్యూహాత్మక అడుగులు వేయిస్తున్నారంటున్నారు. బీజేపీలో విలీనం వ్యతిరేకంగా కవిత మొదట రెబల్‌గా మారిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.
కేసీఆర్ చాణక్యంపై అందరికీ నమ్మకమే !
రాజకీయాల్లో ఒక్కోసారి ప్రత్యర్థులపై వ్యూహాలు రచించాలి.. అదే సమంలో సొంత పార్టీపైనా తప్పదు. కేసీఆర్‌కు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ స్క్రిప్టేనని ఎక్కువ మంది రాజకీయ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్.. తన పిల్లల కంటే ఎప్పుడూ ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరని.. వారు చెప్పింది ఖచ్చితంగా వింటారని చాలా మందికి తెలుసు. కవిత అంటే కేసీఆర్‌కు ఇంకాస్త ఎక్కువ అభిమానం ఇంకా చెప్పాలంటే ఆడపిల్లపై ఏ తండ్రికైనా ఎక్కువ అభిమానం ఉంటుంది. అందుకే… ఈ ఎపిసోడ్ కల్వకుంట్ల కుటుంబంలో చీలిక కాదని.. కేసీఆర్ స్క్రిప్టేనని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కేసీఆర్ పార్టీ పెట్టినపుడు కూడా అప్పట్లో కేసీఆర్‌తో చంద్రబాబు నడిపిస్తున్నారని చర్చించుకున్నారు. కానీ రాను రాను ఆ ప్రచారం తేలిపోయింది. ఇది కూడా అలా అవుతుందా లేకపోతే టార్గెట్ ను రీచ్ చేస్తారా అన్నది జరగబోయే రాజకీయ పరిణామాలను బట్టి క్లారిటీ వస్తుంది.